జగన్ కొత్త ఎత్తుగడ.. విమర్శలకు సామెతతో చెక్

Update: 2021-04-13 05:30 GMT
రాజకీయాల్లో విమర్శలు కామన్. దీనికి ఒక్కొక్కరు ఒక్కోలాంటి భాష్యం చెబుతుంటారు. అధికారంలో ఉన్నా.. ఏదో ఒకటి అంటారు.. లైట్ తీసుకోండని మొన్నటికి మొన్న చెప్పిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాత్రం అందుకు భిన్నంగా ఫైర్ అయ్యారు. మీకంటే మాకు బాగానే మాటలు వచ్చు.. మేం తలుచుకుంటే మోడీ.. అమిత్ షాలను ఉతికి ఆరేస్తామంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదిలా ఉంటే.. ఏపీ అధికారపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనపై వస్తున్న విమర్శలకు కూల్ గా రియాక్టు అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో విపక్ష నేతలు అదే పనిగా టార్గెట్ చేసిన నేపథ్యంలో.. ఆయన తనపై వస్తున్న విమర్శలు.. ఆరోపణలకు ఏ మాత్రం స్పందించకుండా.. ఒక సామెతను చెప్పి విషయాన్ని పక్కన పెట్టేయటం ఆసక్తికరంగా మారింది.

పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నజగన్.. తమ బాధ్యతను తాము సక్రమంగా నెరవేరుస్తున్నందున.. తమను చాలామంది టార్గెట్ చేస్తారని జగన్ వ్యాఖ్యానించారు. సేవా భావంతో ముందుకు సాగుతున్న వారిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారని.. అయితే.. అలాంటి వాటిని తట్టుకొని నిలబడినప్పుడే మనం చేస్తున్న పనులకు సార్థకత చేకూరుతుందని.. ఫలితం ఆశీర్వాదాల రూపంలో ప్రతిబింబిస్తుందన్నారు.

గొప్ప సేవాభావంతో పని చేస్తున్న వలంటీర్ వ్యవస్థ మీద కూడా కొన్ని సందర్భాల్లో ఎల్లో మీడియా కానీ.. ప్రతిపక్షంలో కొంతమంది నేతలు కానీ అవాకులు.. చెవాకులు మాట్లాడటం చేస్తున్నారని.. అలాంటి వారిని పట్టించుకోవద్దన్నారు. ఎప్పుడైనా మీ జీవితాల్లో మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు కూడా వెరవొద్దు.. ఎవరోఏదో అంటున్నారని వెనకడుగు వేయొద్దు.. వారి పాపానికి వారిని వదిలేయండి.. వారి కర్మకు వారిని విడిచి.. మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్లపై విమర్శలు వస్తున్న వేళ.. వారిలో తనదైన శైలిలో మాటలు చెప్పి స్ఫూర్తిని నింపారు. మొత్తంగా విమర్శలు చేసే వారిని..వారు చేసే విమర్శలకు వివరణ.. ఎదురుదాడి లాంటివి చేయకుండా.. సింఫుల్ గా ‘ఇగ్మోర్’ (పట్టించుకోకపోవటం) చేసినట్లుగా చేయటం ఆసక్తికరమని చెప్పాలి.
Tags:    

Similar News