పీపీఏలపై వెనక్కి తగ్గని జగన్‌.. ఏం జరిగినా రెడీయే..!

Update: 2019-08-01 07:04 GMT
పీపీఏలు! ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు! గత చంద్రబాబు ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించి సౌర - పవన విద్యుత్‌ లను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. అయితే, దీనిలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని - అంత రేటు పెట్టి కొనడం ఎందుకని తాజాగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత - సీఎం జగన్‌ ప్రశ్నించడమే కాకుండా అసెంబ్లీలోనూ టీడీపీని ఉతికి ఆరేశారు. ఈ ఒప్పందాలను సమీక్షిస్తామని - తిరగదోడతామని - అవసరమైతే.. రద్దుకు కూడా వెనుకోడబోమని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు వ్యాపార వేత్తలనే కాకుండా రాజకీయాలను కూడా తీవ్రస్థాయిలో కుదిపేశాయి.

వెనువెంటనే దీనిపై కలుగజేసుకున్న కేంద్రప్రభుత్వం ఈ పీపీఏలను తిరగదోడవద్దని - రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించిన ధరలకే ఒప్పందాలు జరిగాయని - కాబట్టి వాటి జోలికి పోవద్దని జగన్‌ ను హెచ్చరించింది . ఈ క్రమంలోనే కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఏకంగా జగన్‌ కు లేఖ రాశారు. ''మీరు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినా.. ఇతర రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలపైనా ప్రభావం పడుతుంది. వ్యాపారులు ఇతర దేశాలకు తరలిపోతారు'' అంటూ కేంద్రం హెచ్చరించింది.

వాస్తవానికి రాష్ట్రంలో జగన్‌ కాకుండా మరే ప్రభుత్వం ఉన్నా సరే! అనేసి వాటి జోలికి పోకుండా తప్పించుకునేవారు. కానీ, తాను అధికారంలోకి రాకముందు నుంచే అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించిన జగన్‌ కేంద్రం చేసిన హెచ్చరికను బుట్టదాఖలు చేసి - తాను చేయాలనుకున్న పనిని ప్రారంభించారు. ఈ క్రమంలోనే పీపీఏలు కుదుర్చుకున్న సంస్థలకు అధికారికంగా ఎలాంటి విషయాన్నీ వెల్లడించకుండా.. వాటి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం మానేశారు.

ఈ నేప‌థ్యంలో ఆయా ఒప్పందాలు చేసుకున్న సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 63ను నాలుగు వారాల పాటు అమలు చేయరాదని హైకోర్టు పేర్కొంది. దీంతో ప్రైవేటు విద్యుత్‌ సంస్థలు ఆనందించాయి. తమనుంచి ఖచ్చితంగా విద్యుత్‌ కొంటారని అనుకున్నాయి. అయితే, హైకోర్టు ఈ జీవోను పక్కన పెట్టిన తర్వాత కూడా జగన్‌ తన వైఖరిని మార్చుకోలేదు. ఆయా సంస్థల నుంచి విద్యుత్‌ ను కొనలేదు. దీంతో మరోసారి ఆయా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.
Tags:    

Similar News