కాల్ మనీపై జగన్ కు ఎందుకో భయం?

Update: 2015-12-14 11:00 GMT
విజయవాడ కాల్ మనీ రాకెట్ వ్యవహారంలో పాలక టీడీపీ నేతల పేర్లు వినిపిస్తున్నా కూడా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి మాటల దాడి కనిపించడం లేదు. నిజానికి టీడీపీ నేతల పేర్లు వినపడగానే ఇక వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కు చంద్రబాబు పిలక దొరికినట్లేనని... ఇక వారు ఆడుకుంటారని చాలామంది భావించారు. కానీ, అలా జరగలేదు. దానికి కారణమేంటా అని ఆలోచిస్తే వైసీపీ నేతలపై జగన్ కు నమ్మకం లేకపోవడం వల్లే ఆయన వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారని తెలుస్తోంది.

కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతల పాత్రపై వైసీపీ నుంచి కొడాలినాని - పార్థసారథి - వాసిరెడ్డి పద్మ వంటి ఒకరిద్దరు స్పందిస్తున్నా అందులో వేడి లేదు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అయితే ఏమాత్రం దీనిపై నోరు జారలేదు. ఈ కేసులో తమ బంగారాలు కూడా ఉండే ప్రమాదముందని... తాను ఒకసారి చంద్రబాబును, టీడీపీని ఈ విషయంలో నిందించడం మొదలుపెట్టాక వైసీపీ నేతల గుట్టు కనుక బయటపడితే పరువు పోవడం ఖాయమని భావించడం వల్లే జగన్ దీనిపై ఇంకా స్పందించలేదని సమాచారం. అటు పోలీసు విచారణలో ఎవరెవరి పేర్లు వస్తున్నాయో చూసుకుంటుండడంతో పాటు, తాను స్వయంగా దీనిపై వివరాలు తెప్పించుకునే పనిలోనూ ఉన్నారట. వైసీపీ నేతలు ఎవరూ లేరని నిర్ధారించుకుంటే తప్ప దీనిపై మాట్లాడరాదని జగన్ అనుకుంటున్నారు. కాల్ మనీ కేసులో కీలక నిందితుడైన చెన్నుపాటి శ్రీనివాస్ తమ పార్టీ నేత వంగవీటి రాధాకు మేనమామ కావడంతో వారిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాప్పటికీ ఇలాంటి వ్యాపారాల్లో పాత్ర ఉన్నా ఉండొచ్చని జగన్ భావించారట. ఆయన అనే కాకుండా వేరే ఇంకెవరైనా ఉన్నా ఉండొచ్చని జగన్ అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నేతలు తరచూ వివాదాల్లో ఇరుక్కుంటుండడంతో ఆయన ఈ విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నారు. ఒకట్రెండు రోజులు చూసి వైసీపీ నేతల పేర్లు ఇందులో లేకపోతే అప్పుడు ప్రభుత్వంపై దండెత్తాలన్నది జగన్ ప్లానుగా తెలుస్తోంది. ఆ కారణంగానే జగన్ ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి కామెంటు చేయలేదట.
Tags:    

Similar News