పోల‌వ‌రంపై జ‌గ‌న్ బిల్ డిస్కౌంట్‌..2021 టార్గెట్..!

Update: 2020-01-12 07:17 GMT
దేశంలోనే అతిపెద్ద బ‌హుళార్థ‌క సాథ‌క ప్రాజెక్టుల‌లో ఒక‌టిగా ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టు త్వ‌ర‌గా పూర్త‌య్యేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌రికొత్త బిల్లు చెల్లింపు విధానంతో ముందుకు వెళుతోంది. వాస్త‌వంగా చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు నిధుల కొర‌త తీవ్రంగా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో బిల్లుల చెల్లింపుకు చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు అటు పోల‌వ‌రం ప్రాజెక్టు ఫ‌లాల‌ను 2021 నాటికి రైతుల‌కు అందించాల్సిందే అని జ‌గ‌న్ ఈ నెల 7న జ‌రిగిన జ‌ల‌వ‌న‌రుల శాఖ స‌మీక్ష‌లో స్ప‌ష్టం చేశారు.

ఈ క్ర‌మంలోనే బిల్లు డిస్కౌంట్ విధ‌ధానం అనుస‌రించాల‌ని నిర్ణ‌యించారు. హెడ్‌ వర్క్స్‌.. ఎడమ కాలువ - కుడి కాలువ - కనెక్టివిటీల(అనుసంధానాలు) పనులతోపాటు నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించ‌నున్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తిపై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో పోల‌వ‌రం ప్రాజెక్టును కంప్లీట్‌ గా పూర్తి చేయాల‌న్న‌దే జ‌గ‌న్ టార్గెట్‌ గా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప‌నుల‌కే స‌గ‌టున నెలకు రు. 1100 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంది.

ఈ క్ర‌మంలోనే నిధుల కొర‌త లేకుండా చూసేందుకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లింపులు చేసి, కాంట్రాక్టర్లకు ‘బిల్‌ డిస్కౌంట్‌’ విధానంలో బిల్లులు చెల్లించి నిధుల‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప‌ద్ధ‌తిలో కాంట్రాక్ట‌ర్లు బ్యాంకు గ్యారంటీ- ఎర్నెస్ట్ మ‌నీ డిపాజిట్‌ - పెర్‌ ఫార్మెన్స్ గ్యారంటీ- రిటెన్ష‌న్ అమౌంట్ విధానాల్లో బ్యాంకుల ద్వారా ప్ర‌భుత్వానికి గ్యారంటీల‌ను స‌మ‌ర్పిస్తారు. కాంట్రాక్ట‌ర్లు ఇచ్చిన గ్యారంటీల ద్వారా ప్ర‌తినెలా బ్యాంకులు వాళ్ల‌కు బిల్లులు చెల్లిస్తాయి. బ్యాంకులు చెల్లించిన ఈ సొమ్మును 90 రోజుల్లోగా ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాలి.

2008లోనే నాటి ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ విధానం అవ‌లంభించారు. ప్ర‌స్తుతం స‌వ‌రించిన అచంనాల‌ను బ‌ట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.55,548.87 కోట్లు ఖర్చు చేయాలి. ఇప్పటిదాకా దాదాపు రూ.17 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో రూ.3,650 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. 2021 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలంటే రూ.38,548.87 కోట్లు అవసరం. మ‌రి ఈ నిధుల‌ను ఎలా రాబ‌డ‌తారో ?  జ‌గ‌న్ 2021 టార్గెట్ ఎలా రీచ్ అవుతారో ?  చూడాలి.



Tags:    

Similar News