మీ త్యాగాలు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయ్‌: జ‌గ‌న్‌

Update: 2018-04-07 13:41 GMT
రాజ‌కీయాల్లో అన్నింటికంటే క‌ష్ట‌మైన‌ది.. క్లిష్ట‌మైన‌ది చెప్పిన మాట మీద నిల‌బ‌డ‌టం. ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో ఇచ్చిన మాట‌ను య‌థాత‌ధంగా అమ‌లు చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అందులోకి కేంద్రంలోని మోడీ స‌ర్కారు మీద ఒత్తిడి తెచ్చేందుకు చేసే ప్ర‌క్రియ అంటే అది చిన్న విష‌యం కాదు. అందుకు ఎంతో వ్యూహ‌ర‌చ‌న అవ‌స‌రం. ఒక మాట నోటి నుంచి వ‌స్తే అది జ‌ర‌గాల్సిందంతే అన్న‌ట్లుగా ఉండ‌టం ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అల‌వాటు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం పార్ల‌మెంటు స‌మావేశాల ఆఖ‌రు రోజు వ‌ర‌కూ చూస్తామ‌ని.. ఏమీ జ‌ర‌గ‌కుండా ఆ రోజే త‌మ ఎంపీలు రాజీనామా లేఖ‌ల్ని స‌మ‌ర్పించి.. నేరుగా ఏపీ భ‌వ‌న్ కు వ‌చ్చి ఆమ‌ర‌ణ‌నిరాహార దీక్ష చేస్తారంటూ జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. దీనికి త‌గ్గ‌ట్లే.. ఎంపీలు రాజీనామాలు చేయ‌టం.. దీక్ష‌కు కూర్చోవ‌టం జ‌రిగిపోయాయి.

భారీ గాలుల ధాటికి దీక్షా శిబిరం చెల్లాచెదురైనా వెర‌వ‌కుండా అక్క‌డే దీక్ష సాగించ‌టం ఒక ఎత్తు అయితే.. 75 ఏళ్ల వ‌యసులో ఆమ‌ర‌ణ దీక్ష‌ను చేసి.. అనారోగ్యానికి గురైనా వెన‌క్కిత‌గ్గ‌ని తీరు మేక‌పాటిలో క‌నిపిస్తుంది.

వైద్యుల సూచ‌న‌తో బ‌ల‌వంతంగా మేక‌పాటిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఢిల్లీలో త‌మ పార్టీ నేత‌లు చేస్తున్న దీక్ష‌పై తాజాగా జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రం దిగిరావాల‌ని.. విభ‌జ‌న హామీల్ని నెర‌వేర్చేలా చేయ‌టం కోసం చేస్తున్న పోరాటంపై జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన వెంట‌నే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూర్చోవ‌టం దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు.

నేత‌ల త్యాగాలు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీలో దీక్ష చేస్తున్న నేత‌ల్ని ప‌రామ‌ర్శించ‌టానికి పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు.. జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సంద‌ర్భంగా దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించ‌టంతో పాటు.. దీక్ష చేస్తూ అస్వ‌స్థ‌త‌కు గురైన మేక‌పాటిని ప‌రామ‌ర్శించ‌నున్నారు.
Tags:    

Similar News