సోషల్ మీడియాలో జగన్ పాదయాత్ర పరుగు

Update: 2017-11-11 01:30 GMT
పాదయాత్రలో జనాదరణ అందుకుంటున్న వైసీపీ అధినేత జగన్ అదేసమయంలో నెటిజన్లకూ తన యాత్రను చేర్చడంతో సఫలీకృతులుతున్నారు. పాదయాత్రతో ప్రతి రోజూ వేలాదిమందిని కలుస్తూనే సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఎంగేజ్ చేయడంలో ముందుంటున్నారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ రోజంతా సోషల్ మీడియాలో జగన్ పేజీలను యాక్టివ్ గా ఉంచుతున్నారు.  సోషల్ మీడియాలో కంటిన్యూస్‌ గా ట్రెండింగ్‌ లో ఉండేలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు సోషల్ ప్లాట్ ఫాంలలో కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నారు. ఇదంతా ప్రశాంత్ కిశోర్ టీం పర్యవేక్షిస్తోందట.
    
జగన్‌ పాదయాత్ర ప్రారంభమైన తొలి రోజునుండే సోషల్‌ మీడియాలో పాదయాత్ర హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండయ్యాయి. జగన్ స్పీక్స్ వంటి హ్యాష్ ట్యాగ్స్ ఆ రోజున ట్రెండయ్యాయి. తాజాగా ఇప్పుడు  కూడా ప్రజా సంకల్పయాత్ర ట్యాగ్ బాగానే నడుస్తోంది. జగన్‌ పేజీలో పోస్టు చేసిన జగన్‌ స్పీక్స్‌ వీడియోను ఇప్పటి వరకూ 2 లక్షల మంది చూశారు. దీంతోపాటు పాదయాత్ర ఫోటోలను లక్షన్నర మంది చూడటంతోపాటు 17 వేల మంది షేర్‌ చేశారు. జగన్‌ చేసిన 8 ట్వీట్లను 16 వేల మంది రీట్వీట్‌ చేస్తే దాదాపుగా లక్ష మంది వాటి గురించి మాట్లాడుకున్నారు. ఇక ప్రజా సంకల్ప యాత్ర హ్యాష్‌ టాగ్‌ తో వైయస్సార్‌ - జగన్‌ అభిమానులు పాదయాత్ర ఫోటోలు - సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఉంచుతున్నారు.
    
ఇదే కాకుండా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలోనూ పాదయాత్ర అలర్ట్స్ ప్రజలకు అందిస్తున్నారు.  9121091210 నెంబరుకు కాల్‌ చేసి, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది వైయస్సార్‌ కుటుంబంలో భాగమయ్యారు. అలాంటి వాళ్ళం దరినీ ప్రజా సంకల్పయాత్రలో భాగం చేయడంలో వాయిస్ రెస్పాన్స్ టెక్నాలజీని మళ్లీ వాడుకుంటున్నారు. జగన్‌ ఏఏ ప్రాంతాలకు వెళతారో, ఆయా ప్రాంతాల్లోని వైయస్సార్‌ కుటుంబ సభ్యులకు ముందు రోజే జగన్‌ వాయిస్‌ తో ఐవీఆర్‌ ఎస్‌ కాల్స్‌ పంపుతున్నారు. తనతో పాటు యాత్రతో కలిసి నడవాలని జగన్‌ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రజలు జగన్ యాత్ర కోసం ఎదురుచూసే పరిస్థితి, కలిసినడవాలన్న ఆసక్తి కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News