జగన్ ప్లానేంటి?

Update: 2016-02-22 07:37 GMT
వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. పార్టీని వీడాలనుకుంటున్న నేతలను ఆపే ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదని సమాచారం. అయితే... పార్టీలో ఇంత అలజడి ఉన్న సమయంలో అధినేత జగన్ మాత్రం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంతో మారిపోతుంటే ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దకుండా ఆయన ఢిల్లీ వెళ్లడం ఆ పార్టీ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
   
సోమవారం ఢిల్లీ వెళ్లిన జగన్ అక్కడ ప్రధాని మోడీ - రాష్ట్రపతి ప్రణబ్ - హోం మంత్రి రాజ్ నాథ్ లను కలవబోతున్నారు. ఆయన పర్యటన ఉద్దేశం స్పష్టంగా వెల్లడించకపోయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా... నిధులు.. కాపు రిజర్వేషన్లు వంటి అంశాలపై అక్కడ చర్చించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ఏపీలో చంద్రబాబు పాలనలో వైఫల్యాలు, ఇతర లోపాలు ఎత్తిచూపుతూ చంద్రబాబుపై ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని సమాచారం. రాజకీయ వ్యూహరచనలో ఇదంతా బాగానే ఉన్నా కేంద్రం వద్దకు వెళ్లడానికి ఇది తగిన సమయం కాదన్న భావన ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. తాను తలచుకుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడం ఎంతోసేపు పట్టదని జగన్ ప్రకటించిన కొద్దిరోజులకే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యే పరిస్థితులు ఏర్పడడంతో ఆయన పరాభవం చెందారు. ఈ సమయంలో ఆయన రాష్ట్రంలోనే ఉండి... మిగతా ఎమ్మెల్యేల మనసులో ఏముంది... వారికి గేలం వేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందా? ఎవరైనా అటు మొగ్గు చూపుతున్నారా? వంటి అంశాలేమీ పట్టించుకుంటున్నట్లుగా లేదు. దీంతో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటేనే జగన్ పట్టించుకోనప్పుడు ఉన్నవారిలో చాలామందికి జగన్ పై నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది.

అయితే.... ఇవేవీ పట్టించుకోకుండా జగన్ మాత్రం తనకు తోచినట్లుగా సాగిపోతున్నారు. ఇప్పుడు కేంద్రం వద్దకు వెళ్లడానికి ఆయన మనసులో ఏం ప్లానుందన్నది తేలాల్సి ఉంది. పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నా కూడా పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లడంలో ఆంతర్యమేమిటో ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News