రైతుల కోసం మ‌ళ్లీ జ‌గ‌న్ దీక్ష బాట‌

Update: 2017-04-19 12:10 GMT
అన్న‌దాత‌ల సంక్షేమం కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పోరుబాట పట్టనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు పూర్తిగా పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జగన్ - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌పై ఒత్తిడి తెచ్చేందుకు దీక్ష చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు ప్రాంతంలో ఈ నెల 26 - 27 తేదీల్లో రెండు రోజుల పాటు జ‌గ‌న్ దీక్షకు దిగనున్నారు.

పంటల దిగుబడి వచ్చి రైతులు తమ పంటలను అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించడం.. అయినా ఈ అంశంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి జ‌గన్ తీసుకువెళ్లారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంలోనూ రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లిన జగన్ వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారు.

పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్ల ఇటీవ‌లి కాలంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ధరలు లేకపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.  గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పతనం అవుతున్నాయి. దుగ్గిరాల పసుపు మార్కెట్‌ లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి రంగంలోకి దిగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గుంటూరును ఎంపిక చేసిన‌ప్ప‌టికీ దీక్షా స్థలాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. స్థలాన్ని నిర్ణయించిన తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News