ఇంకా న‌యం బాబు ఇంగ్లిష్ సినిమాలు చూడ‌ట్లేదు-జ‌గ‌న్‌

Update: 2017-11-06 08:05 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల ప్రాజెక్టు అయిన అమ‌రావ‌తి నిర్మాణంపై ఇప్ప‌టికే ప‌లు వ‌ర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. డిజైన్ల ద‌శ‌లోనే దాదాపు మూడేళ్లు గ‌డుస్తుండ‌టాన్ని ప‌లు వ‌ర్గాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. పైగా న‌చ్చిన న‌గ‌రం తీరును సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసిస్తుండ‌టం ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప్ర‌సంగంలో ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి 'ప్రజాసంకల్ప యాత్ర' ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ చంద్ర‌బాబుకు ఇంగ్లిష్ సినిమాల‌కు లింక్ పెట్టారు.

రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు తీరు చిత్రంగా ఉంద‌ని వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క శాశ్వత బిల్డింగైనా కట్టాడా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.  నాలుగు సంవత్సరాల్లో రైతులు భూములు లాక్కోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు విదేశీ టూర్ల‌లో ఆయా న‌గ‌రాల్లో ప‌ర్య‌టించి అలాంటి నిర్మాణాలే చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టిస్తుంటార‌ని ఎద్దేవా చేశారు. ``రిలీజైన సినిమాలు చూసి ఆ సెట్టింగులు కావాలంటాడు. ఇంకా నయం ఇంగ్లిషు సినిమాలు చూసుంటేనా...`` అంటూ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతం ఏర్పాటు చేయబోయే విషయాన్ని ముందుగానే తన బినామీలకు లీక్‌ చేసి రైతుల భూములు కారు చౌకగా కొనిపించాడని జ‌గ‌న్ ఆరోపించారు. బినామీల భూములు వదిలేసి రైతుల భూములు లాక్కున్నాడని మండిప‌డ్డారు.

చంద్రబాబు పాలనలో రైతులు - అక్కాచెల్లెమ్మలు మోసపోయారని - విద్యార్థులు - నిరుద్యోగులు దగాపడ్డారని - అందుకే రైతుల నుంచి అక్కాచెల్లెమ్మల వరకు అందరిలోనూ చంద్రబాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే ఉండడు అనే మాట వినిపిస్తోందని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని, ఈ నాలుగేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు - అరాచకాలు లేవని వైఎస్‌ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో రైతులు - చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని, ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇచ్చేందుకు తాను పాదయాత్ర చేపడుతున్నట్టు వైఎస్‌ జగన్‌ అన్నారు.
Tags:    

Similar News