అప్పు కోస‌మే హ‌స్తిన‌కు జ‌గ‌న్‌!

Update: 2022-02-09 08:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. అప్పులు చేస్తే త‌ప్పే రోజువారీ ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు కొన‌సాగ‌ని ప‌రిస్థితి ఉంద‌ని ఇప్ప‌టికే విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించాల‌న్నా.. పెన్ష‌న‌ర్ల‌కు డ‌బ్బులు ఇవ్వాల‌న్నా అప్పులు చేయాల్సిందే.

ఓ వైపు అప్పుల కుప్ప‌లు పేరుకుపోతున్నా సంక్షేమ ప‌థ‌కాల పేరుతో  జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌జ‌ల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేస్తూనే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి ప‌డ‌కేసినా.. సంక్షేమ  ప‌థ‌కాల కోసం జ‌గ‌న్ డ‌బ్బులు పంచ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు వైసీపీ ప్ర‌భుత్వానికి ఈ అప్పులు ఎలా పుడుతున్నాయ‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అప్పుల కోస‌మే జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్తున్నార‌నే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడ‌వే నిజ‌మ‌ని తెలిసింది.

ఏపీ సీఎం జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఎన్నో సందేహాలు వ్యక్త‌మ‌వుతాయి. త‌న కేసుల ప‌రిష్కారం కోస‌మే ఆయ‌న హ‌స్తినాకు వెళ్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తుంటాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం బ‌య‌ట‌పెట్టింది. గ‌త నెల‌లో ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీని, అమిత్‌షాను క‌లిశారు. అయితే అప్పు కోస‌మే ఆయ‌న వాళ్ల‌ను క‌లిశార‌ని కేంద్రం తాజాగా పార్ల‌మెంట్‌లో వెల్ల‌డించింది.

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌రింత అప్పు చేసేందుకు ఏపీ అభ్య‌ర్థించింద‌ని పార్ల‌మెంట్‌లో కేంద్రం వెల్ల‌డించింది. మ‌రో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమ‌తి కోరింద‌ని పేర్కొంది. బహిరంగ మార్కెట్లో రుణం తీసుకునేందుకు జ‌గ‌న్ స్వ‌యంగా విజ్ఞ‌ప్తి చేశార‌ని కేంద్ర ఆర్థిక స‌హాయ మంత్రి వెల్ల‌డించారు. 2021-22లో ఉన్న ప‌రిమితిని రూ.42,472 కోట్ల‌కు పెంచాల‌ని అభ్య‌ర్థించార‌ని తెలిపారు. అయితే జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌కు కేంద్రం ఓకే చెప్పింది? లేదా? అన్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు.

జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న విష‌యంపై టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక మంత్రి బ‌దులిచ్చారు. దీంతో అప్పు కోస‌మే జ‌గ‌న్ ఢీల్లీకి వెళ్లార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌కుండా.. ఇలా అప్పుల కోసం వెళ్లి వంగి న‌మ‌స్క‌రిస్తే ఇక కేంద్రంపై పోరాడే అవ‌కాశం ఎలా ఉంటుంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అందుకే ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా జ‌గ‌న్ ఒక్క మాట మాట్లాడ‌డం లేదనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆర్‌బీఐ ద్వారా మ‌రోసారి సెక్యూరిటీ బాండ్లను వేలం వేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో రూ.2 వేల కోట్ల రుణం పొందింది.
Tags:    

Similar News