దేవులపల్లి అమర్‌ పై జగన్ సీరియస్

Update: 2019-11-16 13:15 GMT
ఏపీ ప్రభుత్వానికి జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్‌పై ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రోజు జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబులు తమ ట్విటర్ ఖాతాల్లో రెండు వేర్వేరు జాతీయ పత్రికల్లో ఏపీ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రచురితమైన కథనాలను పోస్ట్ చేశారు. దీంతో నేషనల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా  కథనాలు వస్తున్నాయన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది.

దీంతో ఆయన జాతీయ మీడియా వ్యవహారాలు చూసుకోవడానికి నియమించిన దేవులపల్లి అమర్‌పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మధ్యే అమర్ దిల్లీలో మీడియా వర్గాలను కలుసుకున్నారు. అప్పుడు ఏపీ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జీవో నంబర్ 2430పై నేషనల్ మీడియా ఆయన వద్ద ప్రస్తావిస్తే సమాధానం కూడా చెప్పలేకపోయారట. అప్పటికే ఆ జీవోపైనా నేషనల్ మీడియాలో నెగటివ్ కథనాలు వచ్చాయి. ఇలాంటివాటిని దేన్నీ అమర్ అడ్డుకోలేకపోతున్నారన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

నిజానికి జగన్ సీఎం కాకముందు ప్రతిపక్ష నేతగా ఉండగా నేషనల్ మీడియాలో ఆయన పట్ల పాజిటివ్ కథనాలు వచ్చేవి. కానీ, సీఎం అయిన తరువాత సీను మారిపోయింది.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పాలనపై నేషనల్ మీడియాలో పాజిటివ్ కథనాలు వచ్చేవి. సీఎంకు దిల్లీలో ఒక ఓఎస్డీ ఉండేవారు. ఆ ఓఎస్డీ మీడియా వ్యవహారాలు కూడా చూసుకునేవారు. కానీ, జగన్‌కు ఇప్పుడు ప్రత్యేకంగా పూర్తిస్థాయి ఓఎస్డీ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. అమర్ అమరావతి కేంద్రంగా పనిచేస్తుండడంతో దిల్లీ మీడియాపై పట్టు సాధించలేకపోతున్నారు. ఫలితమే ఈ వ్యతిరేక కథనాలని తెలుస్తోంది.
Tags:    

Similar News