జగన్ 3 వేల పెన్షన్.. చంద్రబాబులో ఒకటే టెన్షన్

Update: 2019-02-06 16:43 GMT
ఆంధ్రప్రదేశ్‌ ను ఊపేస్తున్న జగన్ గాలిని పెన్షన్లు, పసుపుకుంకుమల డబ్బులతో అడ్డుకున్నానని భావిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు జగన్ భారీ షాకిచ్చారు. రాష్ట్రమంతా జగన్ వేవ్ ఉండడంతో దాన్ని తట్టుకుని నిలవడానికి గాను చంద్రబాబు ఇప్పటికే పించన్లను రూ.2 వేలకు పెంచారు. అయితే... జగన్ తాజాగా చేసిన ప్రకటనలో తాను అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తం రూ.3 వేలకు పెంచుతానన్నారు. దీంతో చంద్రబాబు వెన్నులో వణుకు మళ్లీ మొదలైంది.
    
'సమర శంఖారావం' పేరుతో తిరుపతిలో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచి మొదలుకుని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో మట్టి, ఇసుక, బొగ్గు, రాజధాని భూములను, కరెంటు కొనుగోళ్లను వదిలిపెట్టలేదన్నారు. విశాఖ భూములను, గుడి భూములను, దళితుల భూములను వేటినీ వదిలిపెట్టకుండా దోచేశారని జగన్ ధ్వజమెత్తారు. న్యాయానికి, అన్యాయానికి ఎన్నికలు జరగబోతున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. చాలాచోట్ల వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ.. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు.
    
వైసీపీ అధికారంలోకొస్తే వృద్ధాప్య పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని ప్రకటించారు. రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు ప్రజలకు మూడు సినిమాలు చూపిస్తున్నారు. 2014లో మొదటి సినిమా చూపించారు. ఆ సినిమాలో ఆయన కొట్టిన డైలాగుల్లో ఒక్కదాన్ని కూడా చేయలేదు. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ప్రచారం చేశారు. మోదీ వస్తున్నారు.. రెండు నెలల్లో అన్నీ అయిపోతాయని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు.2014 ఎన్నికలయ్యాక మొదటి సినిమాను పక్కన పెట్టి, చంద్రబాబు కొత్త కథ మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్నదే ఆ స్టోరీ. మట్టి, ఇసుక, బొగ్గు, రాజధాని భూములను, కరెంటు కొనుగోళ్లను వదిలిపెట్టలేదు, విశాఖ భూములను, గుడి భూములను, దళితుల భూములను వేటినీ వదిలిపెట్టకుండా దోచేశారు. చంద్రబాబు మరో సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమా టైటిల్.. 'ఎన్నికలకు 6 నెలల ముందు, 3 నెలల కోసం'. నాలుగేళ్లు బీజేపీతో, పవన్ కల్యాణ్‌తో కలిసి తిరిగి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు వాళ్లతో పోరాటం చేస్తున్నట్లుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు సినిమా డైలాగులు కొట్టారు. పునాది కూడా పూర్తి కాకుండానే, దాన్ని జాతికి అంకితం చేస్తూ సినిమా చూపిస్తున్నారు. ఆయనే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అయిదేళ్లుగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడిన వారి మీద పీడీ యాక్టులు పెట్టి జైలులో వేసే కార్యక్రమాలు చేశారు.
    
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. పొదుపు సంఘాల రుణాలు వడ్డీలతో సహా కలిసి 2014 నాటికి రూ.14,000 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.25 వేల కోట్లకు పెరిగాయి. ఈ అయిదేళ్లలో వాటి గురించి ఊసెత్తని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల ముందు 'పసుపు, కుంకుమ' అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించామని.. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. 57 నెలలు మోసం చేసి... ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటున్నారు. కట్టని రాజధానిలో వేల ఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌ తో మభ్యపెడుతున్నారని జగన్ ఆరోపించారు.
    
కాగా రెండేళ్ల కిందట జగన్ నవరత్నాలు ప్రకటించిన సమయంలో ఈ పించన్ల గురించి మాట్లాడుతూ.. రూ.2 వేలు ఇస్తామని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు కూడా రెండు వేలు ఇస్తానంటే తాను 3 వేలు ఇస్తానని అప్పట్లోనే జగన్ చెప్పారు.

    

Tags:    

Similar News