నాన్న పేరు మీద అవార్డులు కాదు.. రాజన్న మాదిరి చేయాలి కదా జగన్?

Update: 2022-11-02 23:30 GMT
అధికారం చేతిలో ఉన్నప్పుడు.. చుట్టు ఉన్న వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పవర్ ను చేతిలో ఉన్న వారు మంచిగా ఉండొచ్చు. కానీ.. వారు చేరదీసిన వారి అతి చేష్టలు కూడా చెడ్డపేరును తీసుకొస్తాయి. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలనను అందించటమే ధ్యేయమని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. . తన తండ్రి పాలనలో ఎప్పుడూ ఎదురు కాని సీన్లు ఇప్పుడు తన అధికార కార్యాలయం ఎదుట ఎందుకు జరుగుతున్నాయన్న విషయం మీద కాస్తంత ద్రష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మిగిలిన ముఖ్యమంత్రులకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మధ్యనున్న తేడా ఏమిటంటే.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఆయన అందుబాటులో ఉండేవారు. ఆ మాటకు వస్తే.. తనకు నచ్చని ముఖ్యులు.. ప్రముఖులు తనను కలిసేందుకు ప్రయత్నిస్తే.. వారిని కలవకుండా చుక్కలు చూపించేవారు.

అదే సమయలో సామాన్యుల విషయంలో మాత్రం ఆయన భిన్నంగా వ్యవహరించేవారు. కడు పేదరికంలో ఉన్న వారు.. కష్టాలతో కిందా మీదా పడేవారు.. అనారోగ్య సమస్యలకు తన వద్దకు సాయం కోసం వచ్చే వారిని ఆయన అస్సలు అలక్ష్యం చేసే వారు కాదు.

డైలీ బేసిస్ లో తన ఇంటి వద్దే ఆయన దర్బారునిర్వహించేవారు. ఉదయమే.. తనను కలిసే వారిని ఒక వరుసలో ఉంచి.. వారి వద్దకు వెళ్లి దస్త్రాలు తీసుకునేవారు. ఎవరైనా తమ ఆవేదనను చెప్పుకునే ప్రయత్నం చేస్తే వారి వేదనను వినేవారు. అందులోకాసింత న్యాయం ఉన్నా.. విషయం సీరియస్ నెస్ ఉన్నా.. వెంటనే వారి ఇష్యూను తేల్చేయాలంటూ అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసేవారు. అనారోగ్య సమస్యలతో సాయం కోరుతూ వచ్చే వారిని ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టకుండా.. వారి సమస్యల్ని ఇట్టే తీర్చేలా నిర్ణయాలు తీసుకునేవారు.

అందుకే.. రాజన్న అంటే అందరికి అదో భరోసా. రాజకీయ ప్రత్యర్థులు సైతం సాయం కోసం చేయి జాచితే.. అప్పటివరకు ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టేసి.. వారిని దగ్గరకు తీసుకొని.. వారి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేవారు.

అలాంటి విలక్షణత ఆయన్ను మహానేతగా మార్చింది. తన తండ్రి పేరును అనునిత్యం ప్రస్తావిస్తూ.. ఆయన  అడుగుజాడల్లో నడిచేందుకు తాను తపిస్తుంటానని పేర్కొనే జగన్.. తన తండ్రి మాదిరి దర్బారు ఎందుకు నిర్వహించరు?అన్నది ప్రశ్న.

తన తండ్రి పేరు మీద పురస్కారాల్ని నిర్వహించి.. అందుకు భారీగా ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి.. అపన్నులు సాయం కోసం.. జగనన్నా అంటూ ఇంటి ముందుకు వచ్చిన వారిని ఎందుకు కలుసుకోవటం లేదన్నది ప్రశ్నగా మారింది. తన తండ్రి మాదిరే ఉదయాన్నే.. సమస్యలతో వచ్చే వారిని కలుసుకుంటూ.. వారి ఆవేదనను వింటూ.. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనుల్ని చేయిస్తే.. తనను కలవటానికి వీల్లేని పరిస్థితుల్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యయత్నాలకు ప్రయత్నించరన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తించాల్సిన అవసరం ఉంది. వైఎస్ బాటలో నడవాలని తపించటం ఓకే. కానీ.. ఆ దిశగా అడుగులు వేయాల్సిందే తానే అన్న విషయాన్ని ఆయన ఎప్పటికి గుర్తిస్తారో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News