ఆ 23 నియోజకవర్గాలపైనే జగన్‌ ప్రత్యేక దృష్టి!

Update: 2022-10-28 23:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్‌ జగన్‌.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు.  
 
ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారి పైన చర్యలు మొదలు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై వేటు వేస్తున్నారు. మరోవైపు ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన వంద మంది కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.

మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన 23 అసెంబ్లీ సీట్లపై వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ 23లో ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వైసీపీతో అంటకాగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు.

23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో నలుగురు పోగా మిగిలిన 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వైసీపీ నియోజకవర్గాల ఇన్‌చార్జులకు జగన్‌ మంచి పదవులు కట్టబెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలను ఎదుర్కోవడానికి వీలుగా వారికి మంచి ప్రాధాన్యతనిస్తున్నారు.

ఈ క్రమంలో కుప్పంలో చంద్రబాబుపైన పోటీ చేసి ఓడిపోయిన భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇక గుంటూరు పశ్చిమలో ఓడిపోయిన ఏసురత్నంకు గుంటూరు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారు.

అలాగే టెక్కెలిలో అచ్చెన్నాయుడుపైన ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవితోపాటు శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్లల్లా వైసీపీ ఇన్‌చార్జ్‌లకు కీలక పదవులను జగన్‌ కట్టబెడుతున్నారు. విశాఖలో గంటా శ్రీనివాసరావు మీద ఓడిపోయిన అక్కరమాని విజయ నిర్మలకు వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ పదవిని ఇచ్చారు.

ఇలా టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట వైసీపీ ఇన్‌చార్జులుగా ఉన్నవారికి కీలక పదవులను జగన్‌ అప్పగించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఎదుర్కోవడానికి అవసరమైన సాధన సంపత్తిని వారికి సమకూరుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News