అప్పుల బాధ : కొత్త ఆదాయాల పై జగన్ స్పెషల్ మీటింగ్

Update: 2022-06-11 02:32 GMT
అప్పుల‌తో స‌త‌మ‌తం అవుతున్న రాష్ట్రానికి ఆదాయ వ‌నరుల ఆర్జ‌న పెద్ద టాస్క్ అయ్యి  కూర్చుంది. ఈ క్ర‌మంలో నిన్న‌టి వేళ తాడేప‌ల్లి క్యాంప‌స్ ఆఫీసులో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పెషల్ మీటింగ్ పెట్టారు. ఆదాయార్జ‌న‌కు మార్గాలు వెతుకులాట‌కు ప్రాధాన్యం, కొత్త ఆదాయాల సృష్టి  దీని సారాంశం.

ముఖ్యంగా జీఎస్టీ అధికారుల‌ పైనే ఎక్కువ‌గా సీఎం ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్ప‌టి దాకా కాస్తో కూస్తో పెర్ఫార్మెన్స్ ఓరియెంటేష‌న్లో ముందుండి రాష్ట్రాన్ని న‌డిపిస్తున్న‌ది, కేంద్రం దగ్గ‌ర ఏపీ ప‌రువు నిల‌బెడుతున్న‌ది వారే క‌నుక ! వారిపైనే భారం వేసి, ముందున్న కాలంలోనూ ఇదే విధంగా ప‌నిచేసి పేరు తీసుకుని రావాల‌ని సీఎం కోరారు.  

దీర్ఘ కాలికంగా ఉన్న బ‌కాయిల వ‌సూలుకు ఇక్క‌డ కూడా ఓటీఎస్ విధానం అమలు చేయాలని సూచించారు. ఈ విధంగా ఆదాయం తీసుకువ‌చ్చే వ‌న‌రుల‌ను స‌మీక‌రించే ఏ శాఖకు అయినా సంబంధిత ప్ర‌తిపాద‌న‌లు హేతుబద్ధంగా ఉంటే... వసూలుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు ఏపీ స‌ర్కారు నిర్ణ‌యిస్తూ సంబంధిత మౌఖిక ఆదేశాల‌ను సీఎం నిన్న‌టి వేళ ఇచ్చారు.

అంటే ఈ ఆదేశాలు ఉత్త‌ర్వుల రూపంలో వెలువ‌డ్డాక, సంబంధిత పాల‌న ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు అమ‌లుకు నోచుకున్నాక అటుపై మ‌రింత వేగంగా ప‌నిచేసి బ‌కాయిల వ‌సూలుకు న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు జీఎస్టీ అధికారులు సమాయ‌త్తం అవుతున్నార‌ని తెలుస్తోంది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఆదాయ సమీకరణ ఒక ఉద్యమంలా జరుగుతున్నమాట. బకాయిలు కట్టాలనుకున్న వారికి బంపరాఫర్లు, అసలు కట్టొదనుకున్న వారికి వేదనలు మిగలనున్నాయి.

రాష్ట్రంలో ఆదాయాన్ని స‌ముపార్జించే శాఖ‌లు అన్నీ మ‌రింత నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయాలి. ఒన్ టైమ్ సెటిల్మెంట్ కింద ల‌బ్ధిదారుల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ వేగంగా పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేష‌న్ ను వేగ‌వంతం చేయాలి.

జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు - భూ ర‌క్ష ప‌త్రాల‌తో పాటు అక్టోబ‌ర్ రెండు నుంచి రిజిస్ట్రేష‌న్ సేవ‌లందించే  గ్రామ స‌చివాల‌యాల సంఖ్య పెరగాలి.. అని చెప్పారు. అదే విధంగా వాణిజ్య  ప‌న్నుల శాఖ‌ను పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌కు ఆ శాఖకు సంబంధించి న్యాయ (లీగ‌ల్), విశ్లేష‌ణ (ఎన‌ల‌టిక్స్‌) విభాగాల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చి సంబంధిత ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెలిపారు.
Tags:    

Similar News