మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న లేకుండానే ముగిసిన జ‌గ‌న్ ప్ర‌సంగం

Update: 2021-08-15 07:30 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎక్క‌డ ఎప్పుడు మాట్లాడాల్సి వ‌చ్చినా..(బ‌హిరంగ స‌భ‌ల్లో) ఇటీవ‌ల కాలంలో తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్నారు. మూడు రాజ‌ధానుల‌కు తాము తీర్మానం చేశామ‌ని.. దానికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. ఆయ‌న ప‌దేప‌దే చెబుతు న్నారు. ఏ జిల్లాలో ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మానికి అంకురార్ప‌ణ చేసినా.. మూడు రాజ‌ధానుల అంశానికి ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. తాజాగా జ‌రిగిన పంద్రాగ‌స్టు వేడుక‌ల్లో ప్ర‌సంగించిన జ‌గ‌న్‌.. అనేక విష‌యాలు ప్ర‌స్తావించినా.. మూడు రాజ‌ధానుల అంశాన్ని మాత్రం లేవ‌నెత్త‌క‌పోవ‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లోపాలు సరిదిద్దుకుని కొత్త బాటలు వేసుకునేందుకు ఇది సరైన సందర్భమని జగన్ అన్నారు. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అనేవి అందరికీ సమానంగా అందాలని.. హక్కులు, వాటి అమలు మధ్య ఉన్న తేడా రూపుమాపాలని తెలిపారు.

వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారో నా పాదయాత్రలో చూశానన్నారు. తమకు మరింత బలం కావాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళలు రాజకీయంగా మరింత సాధికారిత సాధించాలని సీఎం ఆకాంక్షించారు. 26 నెలలుగా ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో బతికేందుకు సొంతిల్లు ఉండాలని సీఎం అన్నారు. వ్యవసాయ రంగంలో రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని.. ఇప్పటివరకు రూ.17 వేల కోట్లు అందించామని తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు.

అంతకుముందు పలు ప్రభుత్వ విభాగాలు సంక్షేమ పథకాలను వివరిస్తూ తయారు చేసిన శకటాలను సీఎం జగన్ పరిశీలించారు. వీటిలో దిశ యాప్, రైతు భరోసా, పోలవరం ప్రాజెక్టు, మహిళా అభివృద్ది శిశుసంక్షేమం, పాఠశాల విద్యాశాఖ రూపొందించిన అమ్మఒడి, మన బడి నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, కరోనా నివారణ, గృహనిర్మాణ శాఖ రూపొెదించిన పేదలందరికీ ఇళ్లు శకటాలున్నాయి. వాట‌న్నింటిని ఆసాంతం ప‌రిశీలించిన సీఎం జ‌గ‌న్‌... సంతృప్తి వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News