ఫిరాయింపుల‌పై జ‌గ‌న్ మార్కు అస్త్రం ఇదే!

Update: 2017-08-02 09:27 GMT
తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడే కాకుండా... రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. ఒక పార్టీ టికెట్‌ పై ప్ర‌జా ప్ర‌తినిధిగా గెలిచి ఆ త‌ర్వాత ఇంకో పార్టీ తాయిలాల‌కు లొంగిపోయి ఆ పార్టీ మారుతున్న నేత‌లు చాలా మందినే మ‌నం చూశాం. అయితే ఈ త‌ర‌హా పార్టీ ఫిరాయింపుల‌పై చ‌ట్టంలో చాలా నిబంధ‌న‌లే ఉన్నాయి. ఏ పార్టీ టికెట్‌ పై అయితే ప్ర‌జాప్ర‌తినిధిగా విజ‌యం సాధించారో, ఆ పార్టీని వీడాలంటే... ఆ పార్టీ టికెట్ ద్వారా ద‌క్కిన ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంది. అలా కాకుండా ఒక పార్టీ నుంచి ద‌క్కిన ప‌ద‌విని ఇంకో పార్టీలో కూడా చేరి అనుభ‌విస్తానంటే మాత్రం చ‌ట్టం ఒప్పుకోదు. అలాంటి కుటిల రాజ‌కీయాల‌కు చెక్ చెప్పేందుకు ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం ప‌ద‌వి ఇచ్చిన పార్టీని వీడ‌కుండానే ఇంకో పార్టీలో చేరిన ప్ర‌జా ప్ర‌తినిధిపై అనర్హ‌త వేటు వేయాలి.

పార్టీ ఫిరాయించిన వారు రాష్ట్ర స్థాయి ప్ర‌జా ప్ర‌తినిధులైతే... ఎమ్మెల్యేల విష‌యంలో శాస‌న‌స‌భ స్పీక‌ర్‌ - ఎమ్మెల్సీల విష‌యంలో మండ‌లి చైర్మ‌న్ ఈ చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు అటు తెలంగాణ‌లోనే కాకుండా ఇటు ఏపీలోనూ భారీ ఎత్తున విప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌కుండానే అధికార పార్టీల్లో చేరిపోయారు. ఇలా పార్టీలు ఫిరాయించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స‌ద‌రు నేత‌ల‌కు టికెట్లిచ్చి గెలిపించిన పార్టీలు ఫిర్యాదు చేసినా స్పంద‌న ల‌భించ‌ని వైనం మ‌న‌కు తెలిసిందే. అయితే ఇలాంటి దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు తాను ఎంతో దూరంగా ఉంటానంటూ ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున త‌న‌కు ద‌క్కిన ఎంపీ ప‌ద‌వితో పాటు త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌కు ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌విని త్రుణ‌ప్రాయంగా వ‌దిలేసుకున్నారు. తిరిగి త‌న సొంత పార్టీ టికెట్ల‌పై ఉప ఎన్నిక‌ల్లో నిలిచి బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో విజ‌యం సాధించారు. అంతేనా... నాడు ఇత‌ర పార్టీల నుంచి త‌న పార్టీలోకి వ‌చ్చిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో రాజీనామాలు చేయించిన జ‌గ‌న్‌... ఆయా స్థానాల్లో ఉప ఎన్నిక‌ల‌కు స్వ‌చ్ఛందంగా ముందుకెళ్లారు. విజ‌య‌ఢంకా మోగించారు. ఒక‌టి అరా స్థానాల్లో ఫ‌లితాలు వ్య‌తిరేకంగా వ‌చ్చినా కూడా ఆయ‌న ఏమాత్రం అధైర్య ప‌డ‌లేదు. ఫిరాయింపులపై త‌న‌ను వేలెత్తి చూపే అవ‌కాశం రాకుండా జ‌గ‌న్ వ్వ‌వ‌హ‌రిస్తున్న తీరు నిజంగానే ఆద‌ర్శంగా ఉంద‌నే చెప్పాలి.

నాడు సానుభూతి ప‌వ‌నాలు వీచి జ‌గ‌న్ గెలిచార‌న్న వైరి వ‌ర్గాల ఆరోప‌ణ‌ల‌ను ఏమాత్రం లెక్క‌చేయ‌ని జ‌గ‌న్‌... నాటి నుంచి కూడా ఫిరాయింపుల‌పై అదే వైఖ‌రితో ముందుకు సాగుతున్నాన‌ని చెప్పేందుకు మ‌రో తాజా నిద‌ర్శ‌నం వెలుగులోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థిగా టీడీపీ నుంచి వ‌చ్చేసిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డిని జ‌గ‌న్ ఖ‌రారు చేశారు. తాజాగా శిల్పా సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కూడా వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధ‌మైపోయారు. మొన్న‌టిదాకా టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా కొన‌సాగిన చ‌క్ర‌పాణిరెడ్డి... మోహ‌న్ రెడ్డి పార్టీ మారిన త‌ర్వాత ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక ప్ర‌స్తుతం టీడీపీ త‌ర‌ఫున ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు.

ఆది నుంచి ఎక్క‌డ ఉన్నా అన్నాత‌మ్ముళ్లిద్ద‌రూ ఒకే వైపు ఉంటూ వ‌చ్చిన శిల్పా సోద‌రులు... ఈ నాలుగైదు నెల‌లు మాత్ర‌మే వేర్వేరు వ‌ర్గాల్లో ఉండిపోయారు. అయితే ఇక అలా ఉండ‌టం కుద‌ర‌ద‌ని భావించిన వారిద్ద‌రూ క‌లిసే ముందుకు సాగాల‌ని, టీడీపీలో జ‌రిగిన అవ‌మానాలు ఇక చాల‌ని, వైసీపీలోనే ఉండిపోదామ‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో శిల్పా సోద‌రులు చ‌క్ర‌పాణి చేరిక‌పై జ‌గ‌న్ తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ నుంచి వారికి ఓ స్ప‌ష్ట‌మైన సందేశం అందిన‌ట్లు స‌మాచారం. ఆ సందేశానికి స‌రేన‌న్న శిల్పా బ్ర‌ద‌ర్స్‌... వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఆదేశానుసారం అటు టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన శిల్పా చ‌క్రపాణి రెడ్డి... టీడీపీ నుంచి త‌న‌కు ద‌క్కిన ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసేశారు.

ఈ సింగిల్ స్టెప్ తో జ‌గ‌న్‌... ఎన్నిక‌లు - నీతివంత‌మైన రాజ‌కీయాల్లో త‌న‌కు ఎంత‌గా గౌర‌వ‌ముందో ఇట్టే చెప్పేసిన‌ట్టైంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు నంద్యాలకు ఉప ఎన్నిక రావ‌డానికి కార‌ణం దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణ‌మే. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా గుండెపోటు కార‌ణంగా చ‌నిపోయారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌ పై విజ‌యం సాధించిన భూమా... ఆ త‌ర్వాత అధికార పార్టీ తాయిలాల‌కు లొంగిపోయి టీడీపీలో చేరిపోయారు. నాడు ఆళ్లగ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్న త‌న కూతురు - ఇప్ప‌టి మంత్రి భూమా అఖిల‌ప్రియ‌ను కూడా ఆయ‌న త‌న వెంట టీడీపీలోకి తీసుకెళ్లారు.

నాడు వీరిద్ద‌రితో పాటు టీడీపీలో చేరిన త‌మ ఎమ్మెల్యేలు 20 మందికి కూడా పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డార‌ని, వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి స్పంద‌న వ‌చ్చిన దాఖ‌లానే క‌నిపించ‌లేదు. ఇత‌ర పార్టీల టికెట్ల‌పై గెలిచిన ఎమ్మెల్యేల‌కు మీరెలా రెడ్ కార్పెట్ ప‌రుస్తారంటూ దూసుకువ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి మౌన‌మే స‌మాధానంగా వినిపిస్తుంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ధైర్యం ముందు చంద్ర‌బాబు తేలిపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా హోరాహోరీగా, ఏడాదిన్న‌ర త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌ గా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో టీడీపీకి నిజంగానే భారీగానే దెబ్బ ప‌డిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
Tags:    

Similar News