జగన్ వ్యూహం... 'దేశం' గందరగోళం..

Update: 2018-08-01 04:30 GMT
కాపులకు రిజర్వేషన్ల అంశంలో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో తాము చిక్కుకున్నామని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లపై తాను స్పష్టత ఇవ్వలేనని, అది కేంద్రం పరిధిలోనిదని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దీంతో తెలుగుదేశం నాయకులకు.. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దిమ్మతిరిగింది. కాపులు ఎక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలోనే. అవే ఉభయ గోదావరి జిల్లాలు. గత ఎన్నికల్లో ఆ రెండు జిల్లాలోనూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అయినా కాని, జగన్ కు వచ్చిన ఓట్లు తగ్గలేదు. అంటే ఈ జిల్లాలు తనకు కలిసి రాకపోయినా మిగిలిన జిల్లాలోని బీసీలు - ఇతర కులాల వారు తన వెంట ఉంటే తనకు అధికారం ఖాయమనే భావనలో ఉన్నారు జగన్. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలు చాలా నష్టపోతారు. రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న కాపుల కోసం ఎక్కువ జనాభా... అందులోనూ అధిక ఓట్లు ఉన్న ఇతర కులాలను ఆకర్షిస్తే తనకు మేలని జగన్ భావిస్తున్నారు. దీంతో జగన్ ఈ సరికొత్త వ్యూహానికి తెర తీశారు.

 తాను కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని ప్రకటించగానే సహజంగానే కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వస్తుందని జగన్‌ కు తెలుసు. అయినా ఇలా ప్రకటించడం వెనుక తన సిన్సియారిటీతో పాటు బీసీలు - ఇతర కులాలను తన వైపు తిప్పుకోవచ్చునని జగన్ భావిస్తున్నారు. ఆయన ఎత్తుగడలకు బీసీలు - ఇతర కులాల నుంచి కూడా అనుకూల పవనాలే వీస్తున్నాయి. అంతకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పై వ్యక్తిగత దూషణలు చేయడానికి కారణం కూడా కాపుల ఓట్లపై శ్రద్ధ చూపించరాదనే అంటున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని నమ్ముకుని కాపులు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఆయన ఎప్పుడు.. ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం కాపు రిజర్వేషన్లపై ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంకు వ్యక్తిగతంగా చరిష్మా తగ్గింది. ఏడాదికో పార్టీ మారే ముద్రగడ అంటే కాపుల్లో కూడా విశ్వాసం లేదు. రిజర్వేషన్ల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పాత చరిష్మా తెచ్చుకోవాలన్నది ముద్రగడ వ్యూహం. అయితే కాపుల్లో కొందరు సీనియర్ నాయకులు - కుల పెద్దలకు మాత్రం ముద్రగడపై అంత నమ్మకం లేదని అంటున్నారు. ఇక మిగిలింది విద్యార్ధులు - యువత. వారిలో విద్యార్ధుల్లో ఎంతమందికి ఓటు హక్కు ఉంటుందో తెలియదు. ఇంత గందరగోళంగా ఉన్న  కాపులను నమ్ముకుని తాను వారికి హామీ ఇవ్వడం వల్ల ఇతర కులాలు... ముఖ్యంగా బీసీలు దూరమవుతారని జగన్ భావిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి వేసిన ఈ సరికొత్త వ్యూహానికి  తెలుగుదేశం అగ్ర నాయకులు సైతం గందరగోళ పడుతున్నారు. కాపులపై జగన్  చేసిన ప్రకటన తర్వాత బీసీ సంఘాల జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య స్పందించారు. జగన్ చేసిన ప్రకటనలో వాస్తవం ఉందన్నారు. తెలుగుదేశం నాయకుడు - శాసనసభ్యుడు కూడా అయిన కృష్ణయ్య చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చేవేనని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  మొత్తానికి జ‌గ‌న్ స్ట్రాట‌జీలు 40 ఏళ్ల సీనియారిటీకి అంతుచిక్క‌డం లేదన్న‌మాట‌.
Tags:    

Similar News