జగన్ ఆయుధం అదొక్కటే

Update: 2015-12-22 11:10 GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమ మాటను నెగ్గించుకోవడానికి ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆయుధం ఒకే ఒక్కటి. అదే.. మూకుమ్మడిగా అసెంబ్లీని బహిష్కరించడం. ఇప్పుడు ఆయన చేసింది కూడా అదే.

సాధారణంగా ప్రతిపక్షాలు అసెంబ్లీలో అధికార పక్షాన్ని రకరకాలుగా బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ, జగన్ ఇందుకు బ్లాక్ మెయిల్ ను ఎంచుకున్నారు. అదే బ్లాక్ మెయిల్ - ఎదురు దాడి మార్గంలో పయనిస్తున్న అధికార పార్టీని ఢీకొనడానికి తమకు ఇంతకుమించిన మార్గం లేదని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి, ప్రతిపక్షం లేని అసెంబ్లీ దీపం లేని ఇల్లు లాంటిది. అసెంబ్లీలో అధికార పక్షం తన ప్రతిపాదనలను, ప్రతిపాదిత చట్టాలను ప్రవేశపెట్టాలి. వాటిలోని లోటుపాట్లు, పొరపాట్లను ప్రతిపక్షం ఎత్తి చూపాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వాటిలో సవరణలు కోరాలు. అధికార పక్షం తీసుకొచ్చిన చట్టం కంటే తాము సవరించిన ప్రతిపాదనల తర్వాత ఆ చట్టం మరింత చక్కగా తయారైందనే భావనను ప్రజల్లో కలిగించగలగాలి. ఇందుకు ప్రతిపక్షాలన్నీ కలిపి మూకుమ్మడిగా కృషి చేయాల్సి ఉంటుంది.

కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం మరొక ప్రతిపక్షం తప్ప మిగిలిన పార్టీలను ప్రజలు ఆదరించలేదు. దాంతో వైసీపీ ఒక్కటే ప్రతిపక్షంగా చలామణి అవుతోంది. మిగిలిన ప్రతిపక్షాలు లేకపోవడంతో ఒకవేళ వైసీపీ వాకౌట్ చేసినా, సమావేశాలను బహిష్కరించినా అధికార పక్షం మీద ఒత్తిడి పడుతోంది. సభను నిర్వహించాలి కనక వైసీపీని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. గతంలో జరిగింది కూడా ఇదే.

అధికార పార్టీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కనక తమకు అసెంబ్లీ బహిష్కరణ మినహా మరో మార్గం లేదని ప్రతిపక్షం వివరిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను మొత్తంగా వైసీపీ బహిష్కరిస్తే.. అక్కడ చర్చలు ఏవీ ఉండవు. కేవలం అధికార పార్టీ తాను అనుకున్న దానిని ఏకపక్షంగా చేయగలుగుతుంది. ఈ వైఖరి ప్రజాస్వామ్యానికి శేయస్కరం కాదు.
Tags:    

Similar News