పాద‌యాత్ర ఫ‌లితం..జ‌గ‌న్ నోట సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Update: 2018-02-06 06:07 GMT
ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ద‌గ్గ‌ర నుంచి చూసేందుకు.. సామాన్యులు నిత్యం ఎదుర్కొనే ఈతి బాధ‌ల్ని మ‌రింత బాగా అర్థం చేసుకునేందుకు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర 80 రోజుల్ని పూర్తి చేసుకుంది. నిజాయితీగా.. నిబ‌ద్ద‌త‌తో ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న ఆలోచ‌న‌తో పాటు.. ఏపీ స‌ర్కారు తీరుపై త‌మ వైఖ‌రిని ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌లా అర్థ‌మ‌య్యేందుకు వీలుగా జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

వంద‌లాది కిలోమీట‌ర్లను న‌డిచేస్తున్న జ‌గ‌న్‌.. సామాన్యులు చేస్తున్న స‌ల‌హాలు.. సూచ‌న‌ల్ని  జాగ్ర‌త్త‌గా వింటున్నారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేది ఏదైనా స‌రే వెంట‌నే గుర్తించి.. అందుకు త‌గ్గ‌ట్లు హామీలుస్తున్నారు.తాజాగా ఒక సామాన్యురాలు సంధించిన ప్ర‌శ్న జ‌గ‌న్ మ‌న‌సును ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. రోజు వ్య‌వ‌ధిలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌గా మారింద‌ని చెప్పాలి.

ఇప్పటి వ‌ర‌కు ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న విధానాల‌పై ఒక చిన్నారి సంధించిన ప్ర‌శ్నాస్త్రం జ‌గ‌న్ పై తీవ్ర ప్ర‌భావాన్ని చూప‌ట‌మే కాదు.. ఇప్ప‌టివ‌ర‌కూ సాగుతున్న తీరుకు భిన్నంగా తాము వ్య‌వ‌హ‌రిస్తామ‌న్న కీల‌క హామీని జ‌గ‌న్ ఇచ్చేలా చేసింద‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆ చిన్నారి ఎవ‌రు? ఎక్క‌డిది? జ‌గ‌న్ ను ఏ ప్ర‌శ్న‌ను సంధించింది? అన్న వివ‌రాల్లోకి వెళితే..

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్నారు. ఆదివారం ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్న జ‌గ‌న్ తిరిగి వెళ్లే వేళ‌లో ఒక చిన్నారి  ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చింది. అన్నా.. మేం ఓసీలం. అంద‌రికీ కార్పొరేష‌న్లు పెడ‌తామ‌ని మీరు చెబుతున్నారు. ఇక మిగిలిపోయింద‌ల్లా రెడ్లు.. క‌మ్మ‌.. క్ష‌త్రియులు మాత్ర‌మే. మాలోనూ చాలామంది పేదోళ్లు ఉన్నారు. మా కోసం కూడా ఒక కార్పొరేష‌న్ పెడితే త‌క్కువ వ‌డ్డీకి రుణాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది క‌దన్నా అంటూ ప్ర‌శ్నించింది.

ఆ చిన్నారి మాట రోజంతా త‌న మ‌దిలో తిరుగుతూనే ఉంద‌ని చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. అన్ని కులాల‌కు కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామంటూ ప్ర‌క‌టించారు. కులాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేయ‌టం వెనుక ఆ కులంలోని పేద‌ల‌కు పావ‌లా వ‌డ్డీకో.. వ‌డ్డీ లేకుండానో రుణాలు ఇవ్వ‌టం కోస‌మేన‌ని.. ఆ రుణాల‌తో వారు బాగుప‌డ‌తార‌న్న ఉద్దేశ‌మేన‌ని.. చిన్నారి అడిగిన ప్ర‌శ్న త‌న‌ను వెంటాడింద‌ని.. అన్ని కులాల్లో ఉన్న పేద‌రికాన్ని త‌రిమికొట్టేందుకు అంద‌రికి స‌మాన అవకాశాల్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు జ‌గ‌న్ పేర్కొన్నారు. ఏమైనా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత మేలు చేయాల‌న్న త‌ప‌న ఉన్న‌ప్పుడే ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు వ‌స్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News