హామీలు మొదలుపెట్టేసిన జగన్..

Update: 2016-12-07 11:30 GMT
వైసీపీ అధినేత ఇటీవల కాలంలో ఎక్కడకు వెళ్లినా తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తానో చెబుతూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. కొద్దిరోజులుగా ఆయన హామీల వేగం మరింత పెరిగింది. తాజాగా ఆయన... తాము అధికారంలోకి వస్తే కేవలం మూడు నెలల కాలంలోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు. ఒక్క రెండేళ్లు ఓపిక పడితే చాలని... మీ కల నెరవేరుస్తానని చెప్పారు.
    
తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు జగన్ వచ్చారు. ఈ సందర్భంగా బూరుగుపూడి గ్రామం వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లు జగన్ ను కలిశారు. ఏళ్ల తరబడి తాము ఉద్యోగం చేస్తున్నా... తమను రెగ్యులరైజ్ చేయడం లేదని జగన్ కు మొరపెట్టుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దీంతో, తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
    
కాగా.. ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని కూడా ఇప్పటికే జగన్ పలుమార్లు అన్నారు.దీంతో ముందస్తు ఎన్నికలు వస్తాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం సర్వేల్లో తెలుస్తుండడంతో చంద్రబాబు ఆ వ్యతిరేకత ఇంకా పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ ధైర్యంతోనే జగన్ ప్రజలకు తన ప్రభుత్వం ఏమేం చేస్తుందన్నది హామీలిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News