జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో మ‌రో రికార్డ్‌...

Update: 2018-05-05 10:37 GMT
వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మ‌రో కీల‌క మైలురాయి చేర‌నుంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ యాత్ర వ‌చ్చే వారంలో 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ నెల 14న వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని, ఏలూరు వద్ద వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కార్యాక్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

ప్రజాసంకల్పయాత్ర ఈనెల 14వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్న నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందించాలని పార్టీ ఒక కార్యాచరణను రూపొందించిందని సుబ్బారెడ్డి వివ‌రించారు. 2 వేల కిలోమీట‌ర్లు పూర్తి అయిన సంద‌ర్భంగా పండుగ‌లా చేసుకుందామ‌ని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. దీంతో పాటుగా సీఎం చంద్రబాబు మోసాలను ఎండగుతూ ఈ నెల 14, 15 తేదీల్లో నల్లజెండాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 16న కలెక్టరేట్ల వద్ద వంచనపై గర్జన పేరుతో ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ధర్నాల అనంతరం సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవని  సుబ్బారెడ్డి ఆక్షేపించారు. పరిశ్రమల పేరిట లక్షలమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తాండవం అడుతోందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అన్ని వ్యవస్థలనూ సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో చంద్రబాబు ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

ఇదిలాఉండ‌గా.. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర రికార్డ్‌ కు చేరువ అవుతున్న నేపథ్యంలో విశాఖలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర‌ నాలుగో రోజుకు చేరింది. శ‌నివారం ఉద‌యం విజ‌య‌సాయిరెడ్డి  పాదయాత్ర ప్రారంభించి విశాఖ‌లోని వీధుల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌మ స‌మ‌స్య‌లు విజ‌య‌సాయిరెడ్డికి చెప్పుకొని త‌గు ప‌రిష్కారం చూపాల‌ని, ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కోరారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో విశాఖ‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లేవీ ప‌రిష్కారం కాలేద‌ని విమ‌ర్శించారు.
Tags:    

Similar News