రోడ్డెక్కిన వైసీపీ...ఎదిరిస్తున్న విధేయత

Update: 2022-04-11 05:15 GMT
వైసీపీ అంటే ఏక వ్యక్త్రి నిర్మాణం పార్టీగానే అంతా చూస్తారు. అక్కడ ఒకే ఒక్కడుగా జగన్ ఉంటారు. అన్ని నిర్ణయాలకు ఆయనే కర్త కర్మ క్రియగా చెబుతారు. అలాంటి జగన్ నిర్ణయం ఒక్కసారి తీసుకుంటే అది శిలాశాసనమే. ఆయన ఎమ్మెల్సీలను మంత్రులను చేయగలరు, ఇక వారిని మంత్రి పదవులకు రాజీనామాలు చేయించి నేరుగా రాజ్యసభకు పంపించగలరు.

ఏకమొత్తంగా మంత్రులు అందరి నుంచి రాజీనామాలు తీసుకోగలరు. అలా తీసుకున్న వారిని తాను ఎలాగైనా వాడుకుంటాను అని చెప్పగలరు. కానీ పన్నెండేళ్ల వైసీపీ చరిత్రలో జగన్ నిర్ణయాలు ఎపుడూ ఎస్ బాస్ అని మాత్ర్రమే  క్యాడర్ అమలు చేసింది. నాయకులు సైతం శిరోధార్యంగా భావించేవారు. అయితే ఫస్ట్ టైమ్  వైసీపీ రోడ్డున పడింది.

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పర్వంలో వైసీపీ పరువు బజారున పడింది. విపక్ష నేతల కంటే దారుణంగా జగన్ని సొంత పార్టీ వారే నిందిస్తున్నారు. మరీ ముఖ్యంగా వారిలో వైఎస్సార్ ఫ్యామిలీతో ఏళ్లకు ఏళ్ళు పైబడి సాన్నిహిత్యం ఉన్న వారే మొదట ఎదురుతిరగడం విశేషం.

ఈ జాబితాలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతో సుచరితలను తీసుకోవచ్చు. వారే ఇలా చేయడంతో మిగిలిన వారు కూడా రోడ్డెక్కారు. వారూ వీరూ తేడా లేకుండా పెద్ద ఎత్తున అనేక జిల్లాల్లో వైసీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. జగన్ ఫ్లెక్సీలను చింపేశారు. వైసీపీ జెండాలను తొలగించారు. పార్టీ ఆఫీసుల వద్ద ఆందోళనలు చేశారు.

ఇదంతా చూస్తూంటే వైసీపీకి శత్రువు వైసీపీయే అని అర్ధం అవుతోంది. అదే టైమ్ లో పార్టీ గొప్పగా చెప్పుకునే క్రమశిక్షణ అన్నది నేతి బీర కాయ చందం అని అర్ధమవుతోంది. అలాగే విధేయత, అన్న మాటే మాకు వేదం అని చెప్పే రొటీన్ డైలాగులకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది.

జగన్ నిర్ణయం అయినా సరే  తమకు నచ్చకపోతే ఎదిరిస్తాం, తమ సత్తా చూపిస్తామని నేతలు అంటున్నారూ అంటే వైసీపీ కట్టు బాగా తప్పేసిందనే అర్ధం చేసుకోవాలి. రాజకీయ పార్టీలలో ఇలాంటివి సహజం అయినా ప్రాంతీయ పార్టీలలో ఏక వ్యక్తి నాయకత్వాన నడిచే వాటిలో కాస్తా అడ్డుకట్ట ఉంటుంది. వాటిని కూడా దాటేసి నేతలు ముందుకు ఉరుకుతున్నారూ అంటే నాయకత్వ లోపం అని స్పష్టంగా చెప్పాల్సిందే. దీన్ని చెక్ చేసుకోకపోతే వైసీపీని ఓడించేది ఎవరో కాదు, వైసీపీనే. ఇది డ్యామ్ ష్యూర్ అనే చెప్పాలి.
Tags:    

Similar News