జ‌గ‌న్ పాదాభివంద‌నం చేసినా త‌ప్పేనా?

Update: 2017-07-05 08:31 GMT
ఏపీలో రాజ‌కీయాల‌ను శాసించ‌డానికి మీడియా ఎంత‌కైనా దిగ‌జారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ఓ ప‌త్రిక కల్ల‌బొల్లి అల్లిక‌ల‌తో త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంద‌ని వైసీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్  కోవింద్ పర్యటన సందర్భంగా జగన్ ఆయ‌న్ను క‌లిసి, ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డంతో పాటు ఆయ‌న పాదాల‌కు న‌మ‌స్క‌రించడాన్ని ఆ ప‌త్రిక ఏమాత్రం త‌ట్టుకోలేక పోయింద‌ని.. జ‌గ‌న్ కు దానివ‌ల్ల మైలేజి పెరుగుతుంద‌ని భ‌య‌ప‌డి జ‌గ‌న్ ను ద‌ళిత వ్య‌తిరేకిగా చూపించేందుకు అప్ప‌టిక‌ప్పుడు క‌థ‌నాన్ని వండివార్చింద‌ని వినిపిస్తోంది. అంతేకాదు... అక్క‌డి పాత్రికేయులు ఆ ఆలోచ‌న‌ను వ్య‌తిరేకించినా కూడా ఆ మీడియా సంస్థ అధినేత బ‌ల‌వంతంగా రాయించార‌ని జ‌ర్న‌లిజం వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

నిజానికి రామనాథ్ కోవింద్ కు జ‌గ‌న్ పాదాభివందనం చేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేక‌పోయారు. జగన్ వ్యవహరించిన తీరుకు మంచి స్పంద‌న వ‌చ్చింది. కానీ... స‌ద‌రు మీడియా అధినేత ఈ పాజిటివ్ ఇమేజిని ఎలాగైనా దెబ్బ‌తీయాల‌ని.. నెగ‌టివ్ స్టోరీ రాయాల‌ని ఎడిటోరియ‌ల్ సిబ్బందికి చెప్ప‌గా, దాన్ని వారు వ్య‌తిరేకించార‌ని.. వయసులో పెద్దవాడు కాబట్టి రామనాథ్‌ కోవింద్‌కు జగన్‌ పాదాభివందనం చేసి ఉండవచ్చ‌ని, ఇలా ప‌నిగ‌ట్టుకుని రాయడం కరెక్ట్‌ కాదేమోనని వారు చెప్పార‌ట‌. కానీ, రామనాథ్‌ కోవింద్‌ తో ఫొటోలు దిగేందుకు దళిత ఎమ్మెల్యేలు ప్రయత్నించగా వారిని జగన్ అడ్డుకుని, ఆ త‌రువాత వారిని త‌న ఇంటికి పిలిపించుకుని వారితో  కాళ్లు మొక్కించుకున్నాడని రాయాలంటూ ఆర్డ‌ర్ జారీ చేయ‌డంతో వారు ఆ మేర‌కు క‌థ‌నాన్ని వండివార్చార‌ని తెలుస్తోంది.

ఇదంతా ఎలా ఉన్నా జ‌గ‌న్ ఇలా దేశ అత్యున్న‌త ప‌ద‌విని చేప‌ట్ట‌బోయే ద‌ళిత అభ్య‌ర్థికి పాదాభివంద‌నం చేయ‌డం మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఎన్న‌డూ త‌న తండ్రికి కానీ, ఎన్నో సార్లు క‌లిసినా ప్ర‌ధాని మోడీకి కానీ, త‌నంటే ఇష్ట‌ప‌డే ప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి కానీ ఎన్న‌డూ పాదాభివంద‌నం చేయ‌ని జ‌గ‌న్ ఇలా చేయ‌డం మీడియాలో బాగా హైలైట్ అయింది. ముఖ్యంగా ద‌ళిత వ‌ర్గాల్లో ఇప్ప‌టికే ఆద‌ర‌ణ ఉన్న జ‌గ‌న్ కు ఇది మ‌రింత ప్ల‌స్ పాయింట్ అని అనుకుంటున్నారు. వ్య‌తిరేక మీడియా ఎన్ని ఎత్తులు వేసినా కూడా అవి నిల‌వ‌బోవ‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి.


Tags:    

Similar News