జగన్ ఆరోపణ.. ప్రత్తిపాటి మార్క్ రియాక్షన్

Update: 2016-03-28 16:13 GMT
తెలుగు సినిమాకు.. ఏపీ అసెంబ్లీకి కాస్త దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో దాదాపుగా తర్వాత సీన్ ఏంటి? హీరో ఏం చేస్తాడు? విలన్ ఎలా వ్యవహరిస్తారు? అంతిమంగా ఏం జరుగుతుందన్న విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవు. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉండటం చాలా అరుదు. దాదాపుగా అన్ని సినిమాలు ప్రేక్షకుడు అనుకున్నట్లే సాగుతుంటాయి. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా ఇదే తీరులో నడుస్తున్నాయి.

ప్రతి విషయానికి ఏపీ అధికారపక్షానికి చెందిన నాయకుల మీద విపక్ష నేత జగన్ ఆరోపణలు చేయటం.. ఈ సందర్భంగా ఆయన తరచూ ఒకేలాంటి మాటలు మాట్లాడితే.. ఆయన ఆరోపణలకు స్పందించే ఏపీ అధికారపక్షనేతల సమాధానాలు సైతం ఒకే రీతిలో ఉండటం కనిపిస్తుంది.  ఆ మధ్య ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ అధికారపక్ష నేతలకు  భారీగా భూములు ఉన్నాయని జగన్ మీడియా సంస్థ భారీ కథనాల్ని అచ్చేయటం తెలిసిందే.

దీనిపై పెద్ద ఎత్తు ఆరోపణలు.. ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అగ్రిగోల్డ్ వ్యవహారంపై విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద కొన్ని ఆరోపణలు చేశారు. ప్రత్తిపాటికి అగ్రిగోల్డ్ తో సంబంధాలు ఉన్నాయని.. ఆయన సతీమణి పేరు మీద అగ్రిగోల్డ్ భూములు ఉన్నట్లుగా ఆరోపించారు.

జగన్ ఆరోపణలకు మండిపడ్డ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా స్పందిస్తూ.. తన భార్య పేరిట కొన్నట్లు ఆధారాలు చూపితే.. వాటిని మీకే రాసేస్తా అంటూ సవాలు విసిరారు. అక్రమాస్తుల వ్యవహారంపై విపక్ష నేత ఆరోపణలు చేయటం.. దానికి కౌంటర్ గా.. ఆ ఆస్తుల వివరాలు బయట పెడితే.. మొత్తం ఆస్తిని రాసేస్తాననటం ఈమధ్య ఒక అలవాటుగా మారింది. తాజాగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇదే రీతిలో రియాక్ట్ కావటం చూసినప్పుడు.. విపక్ష నేత చేసే ఆరోపణ.. దానికి అధికారపక్షం నేతలు ఇచ్చే కౌంటర్ దాదాపుగా ఒకేలా రకంగా ఉండటం కనిపిస్తుంది. రాజకీయాలన్నాక ఆరోపణలు మామూలే. కనీసం డైలాగుల్లో అయినా కాస్తంత మార్పు ఉంటే బోర్ కొట్టకుండా ఉంటుంది.
Tags:    

Similar News