జగన్ కూడా జై అమరావతి ...?

Update: 2021-11-25 16:30 GMT
అమరావతి ఏపీలో హాట్ టాపిక్. ఎవరు అవునన్నా కాదన్నా కూడా వచ్చే ఎన్నికల్లో అమరావతితో పాటు మూడు రాజధానుల అంశం కీలకంగా మారుతుంది. జనం కూడా తమ అభిప్రాయాలను అపుడు స్పష్టంగా చెబుతారు అంటున్నారు. ఏపీకి రాజధాని అన్నది లేకపోవడం అయిదు కోట్ల ఆంధ్రులకు బాధ కలిగించే అంశం. ఏదో ఒకటి రాజధాని అన్నది ఉండాలన్నది మెజారిటీ ప్రజల భావన.

ఈ నేపధ్యంలో అమరావతి అంశం విపక్షాలకు మరీ ముఖ్యంగా టీడీపీకి కలసివస్తుంది అన్న అంచనా అయితే ఒకటి ఉంది. దాంతో వైసీపీ మూడు రాజధానుల అంశం ఒక ప్రయోగం కావడం, అది దేశంలో ఎక్కడా లేకపోవడం వల్ల జనాలు అధిక శాతం ముందు ఉన్న ఒక రాజధానినీ అలా కొనసాగిస్తే మేలు అన్న భావనతో ఉన్నారు. రాజధాని అన్న సెంటిమెంట్ రగిలినపుడు అది ప్రాంతాలకు అతీతంగానే రాజుకుంటుంది.

దాంతో వైసీపీ ముందు జాగ్రత్తగానే అన్నీ గుర్తెరిగి మూడు రాజధానుల చట్టాన్ని వ్యూహాత్మకంగానే ఉపసంహరించుకుంది అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అమరావతి విషయంలో జగన్ నిండు సభలో తన మనసులోని మాటను పంచుకున్నారు. అమరావతి మీద తనకు ప్రేమ ఉందని చెప్పారు.

తన ఇల్లు కూడా అక్కడే ఉందని కూడా మరో మారు గుర్తు చేశారు. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని కూడా వివరించారు. సరే ఇది మాటల వరకూ బాగానే ఉన్నా జగన్ ఏలుబడిలో అమరావతికి చిటికెడ్ సిమెంట్ అయినా వేసి అభివృద్ధి చేయలేదు అన్న మాట అయితే గట్టిగానే ఉంది.

దాంతో అర్జంటుగా జగన్ అమరావతి మీద తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మూడు రాజధానులు అంటున్న ఆయన ఆయా చోట్ల ఏమి అభివృద్ధి చేశారు అన్న విపక్షాల విమర్శలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. దాంతో జగన్ ఇపుడు అమరావతి మీద దృష్టి పెట్టారని అంటున్నారు.

అందుకోసం రానున్న రెండున్నరేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపించి అక్కడ మిగిలిపోయిన భవనాలను పూర్తి చేయాలి అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అమరావతిలో రైతులు భూములు ఇచ్చారు. వారు కోరుకునేది తమ భూములు అభివృద్ధి చెందాలని, దాని కోసం ప్రభుత్వం చేయాల్సింది చాలానే ఉంది.

అందుకే జగన్ సర్కార్ ప్రపంచ బ్యాంక్ ని ఆశ్రయించనుంది అని చెబుతున్నారు. అమరావతి అభివృద్ధి మీద ప్రపంచ బ్యాంక్ నుంచి ఏకంగా యాభై వేల కోట్ల రూపాయలను తీసుకురావాలని జగన్ భారీ ప్రణాళికతో ఉన్నారని చెబుతున్నారు. ఆ నిధులను వెచ్చించి అమరావతికి రాజధాని రూపుని తీసుకురావడమే కాకుండా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను తన హయాంలోనే పంపిణీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

అదే కనుక జరిగితే విపక్షాలకు ఎటువంటి రాజకీయ అజెండా లేకుండా ఉంటుందని వైసీపీ పెద్దలు తలపోస్తున్నారు. ఇక ఈ నిధుల నుంచి కొంత భాగం విశాఖ అభివృద్ధికి రాయలసీమలోని కర్నూలు సహా ఇతర నగరాల అభివృద్ధికి కూడా వెచ్చించడం ద్వారా అభివృద్ధి జరగలేదు అన్న వారికి సరైన జవాబు చెప్పాలని జగన్ భావిస్తున్నారుట.

మరి ప్రపంచ బ్యాంక్ వైసీపీ సర్కార్ కోరినట్లుగా యాభై వేల కోట్లు ఇస్తేనే ఇవన్నీ సాకారం అయ్యేది. ఆ దిశగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని అంటున్నారు. అన్నీ కుదిరితే మాత్రం జగన్ కూడా జై అమరావతి అంటూ ఎన్నికల గోదాలోకి హ్యాపీగా దిగిపోతారని అంటున్నారు.




Tags:    

Similar News