మండలి రద్దుపై జగన్ మాటలు విన్నారా?

Update: 2020-01-24 05:38 GMT
అధికారంలో ఉన్న వారు.. తాము అనుకున్నది చేయాలనుకోవటం సర్వ సాధారణం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తమకు తోచినట్లుగా ఉపయోగించటం..దానికి స్పందనగా ప్రజలు ఇచ్చే తీర్పు తర్వాతి రోజుల్లో వారి రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంటాయి. ఈ కోణంలో చూసినప్పుడు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు. అందుకు తగ్గ ప్రజాప్రతినిధుల బలాన్ని అందించారు.

తాను సిద్ధం చేసుకున్న ఎజెండాతో పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి..ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో.. ఈ రోజు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్రాన్ని ఒక క్రమపద్దతిలో డెవలప్ చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని చెప్పాలి. తన నిర్ణయాన్ని ప్రశ్నించే రీతిలో వ్యవహరించిన మండలి ఛైర్మన్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయం అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం చెప్పకనే చెప్పేస్తుంది.

ఏపీ అసెంబ్లీలో జగన్ మాటలు విన్నంతనే అర్థమయ్యేది.. ఆయన మండలికి మంగళం పాడేద్దామని డిసైడ్ అయ్యారని. తాను తీసుకుంటున్న నిర్ణయాల్ని మండలిలో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న వైనానికి తెర దించాలన్న ఆలోచనలో ఆయనలో రావటమే కాదు.. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

ఈ అభిప్రాయానికి బలం చేకూరేలా జగన్ మాటలు ఉన్నాయి. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకంగా మారినవని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘అధ్యక్షా.. ఇవాళ కొన్ని అంశాలను సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకు వచ్చి మీ అందరి నిర్ణయాన్ని అడగదలుచుకున్నా. 2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో.. అంటే 86 శాతం మంది ఎమ్మెల్యేలతో ప్రజల మాటే వేదంగా ఈ సభ ఏర్పడింది. అంటే ఇది ప్రజలు ఆమోదించిన సభ. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది’’

‘‘పాలకులం కాదు సేవకులం అని చెప్పినట్టుగా నడుచుకుంటున్నాం. శాసనమండలిలో నిన్న (బుధవారం) జరిగిన ఘటనలు నన్ను ఎంతగానో బాధించాయి. ప్రజాస్వామ్యంలో చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌ అన్నవి ఉండాలి.. ఉంటాయి. వాటికి నేను ఏ రోజూ వ్యతిరేకం కాదు. చట్టాన్ని కాపాడటానికి ఇవి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి ఉపయోగించుకోవడానికి మాత్రం కాదు‘‘

‘‘మండలి అన్నది చట్టసభలో భాగం కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. కానీ నా నమ్మకంతో పాటు ఐదు కోట్ల మంది ప్రజలందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిన్న శాసనమండలిలో జరిగిన తంతు గమనించాం. శాసనమండలి చైర్మన్‌.. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న (బుధవారం) చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని జారీ చేసిన ఆదేశాల వల్ల ఎవరికైనా అర్థమవుతోంది. శాసనమండలి చైర్మన్‌ చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అధికారాల వికేంద్రీకరణకు మేము ప్రవేశపెట్టిన బిల్లును మండలి చర్చించి ఆమోదించవచ్చు.. లేదా తిరస్కరించవచ్చు.. లేదా వారి అభిప్రాయాలు సూచిస్తూ సవరణలతో తిప్పి పంపవచ్చు. చట్టం కూడా ఇదే చెబుతోంది. కానీ ఇవేవీ కూడా లెక్క చేయకుండా మండలి చైర్మన్‌ విచక్షణాధికారం అంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు’’

‘‘విచక్షణా అధికారం అనేది ఏదైనా సందిగ్ధత ఉన్నప్పుడు ఉత్పన్నం అవుతుంది. రూల్స్‌ ప్రకారం సెలెక్ట్‌ కమిటీకి పంపే అవకాశం లేదని ఆయనే చెప్పారు. మరోవైపు తనకు లేని అధికారం ఉపయోగించి ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం, విధానం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది’’

‘‘విచక్షణ అధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించడానికి వాడానని ఆయనే చెబుతున్నారు. అంటే విచక్షణాధికారం చట్టాన్ని పరిరక్షించడానికి కాకుండా ఉల్లంఘించడానికి వాడారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా.. అని అందరమూ ఆలోచించాలి. రాజ్యాంగ రచన కోసం నాడు ఏర్పాటు చేసిన కాన్‌స్టిట్యూషనల్‌ అసెంబ్లీ.. రాష్ట్రాల్లో రెండవ సభ అంటే మండలి ఉండాలా.. వద్దా అనే చర్చలో అత్యధికులు ఇది అనవసరం అని అభిప్రాయపడ్డారు. డబ్బు ఖర్చు తప్ప ఏ ప్రయోజనం ఉందదన్నారు’’

‘‘దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం. ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా, ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా ఆపాలి.. ఎలా డిలే చేయాలి.. అని రూల్స్‌ను సైతం ధిక్కరిస్తున్న ఇలాంటి మండలిని కొనసాగించాలా.. వద్దా.. అన్నది సీరియస్‌గా ఆలోచించాలి. హత్య చేయడం తప్పు. అయినా నేను హత్య చేస్తానన్నట్లుంది.  ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?’’

‘‘అధ్యక్షా.. మీరు అనుమతిస్తే సోమవారం మళ్లీ సభను పెట్టండి. ఇంకా సుదీర్ఘంగా చర్చించి ఇటువంటి మండలిని కొనసాగిద్దామా.. వద్దా.. అని నిర్ణయం తీసుకుందాం. ఈ సిస్టంను క్లీన్‌ చేసే విషయంలో నాలుగు అడుగులు ముందుకేయాలని మిమ్మల్ని, శాసనసభ్యులందరినీ అభ్యర్థిస్తున్నా’’


Tags:    

Similar News