గుర్తుందా డిసెంబర్ 23... సొంత జిల్లావాసులే అడుగుతున్నారు

Update: 2022-12-23 12:31 GMT
కొన్ని డేట్స్ అలా గుర్తుండిపోతాయి.  అయితే పాలకులు మాత్రం చాలా డేట్స్ మరచిపోతారు. కానీ వారు చెప్పిన మాటలను మనమ చేసుకుంటూ ఆ రోజుని గుర్తుంచుకుంటారు జనం. అలా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప వాసులు ఒక రోజును గుర్తుంచుకుంటున్నారు. అదే డిసెంబర్ 23. ఈ రోజుకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత అంటే అక్కడ వుంది విషయం.

సరిగ్గా ఈ రోజూ మూడేళ్ళ క్రితం 2019లో జగన్ సీఎం అయిన తొలి ఆరు నెలల కాలంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఆనాడు జగన్ చెప్పినది ఏంటి అంటే ఏడాదిలో ఉక్కు కర్మాగారాన్ని పూర్తి చేసి మూడు వేల మంది యువతకు ఉపాధిని కల్పిస్తామని.అది చెప్పి మూడేళ్ళు దాటింది. కానీ ఒక్క ఉద్యోగం లేదు.  దానికంటే ముందు పునాది రాయి వేసిన ఉక్కు కర్మాగారం ఊసు కూడా లేదు.

దీంతోనే కడప వాసులు ఈ రోజును చాలా స్పెషల్ గా గుర్తు చేసుకుంటున్నారు. ఉక్కు కర్మాగారం కడప వాసుల కల. అది తీరడంలేదు. అలాగే ఉపాధి దక్కడంలేదు. చిత్రమేంటి అంటే ప్రతీ ఏడాది జగన్ కడపకు ఈ డేట్స్ లో వెళ్తారు. ఆయన సొంత జిల్లాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఆయన వెళ్తారు.

మరి జగన్ కి డిసెంబర్ 23 ఎంతవరకూ గుర్తుందో కానీ జనాలు మాత్రం అదే తలచుకుంటున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కొన్ని డేట్స్ క్యాలండర్స్ లో ఉంచారు. సంక్షేమ క్యాలెండర్ అన్నారు అది అమలు చేస్తున్నారు. కానీ దానికి అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇక జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ జాబులూ లేవు, క్యాలండరూ లేదు ఆ విషయం కూడా మరచిపోయారు అని అంటున్నారు. ఇపుడు డిసెంబర్ 23 కూడా ఆ లిస్ట్ లోనే ఉంది అని అంటున్నారు. ఉక్కు కర్మాగారం కోసం తాజాగా మరో కంపెనీ రేసులోకి వచ్చింది. మరి అదెపుడు పునాది రాయి వేస్తుందో ఇంకెప్పుడు ఉపాధి ఇస్తారో ఎవరికీ తెలియదు.

ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వ పెద్దలకు గుర్తుందా డిసెంబర్ 23 అంటే కోపాలు రావచ్చేమో కానీ నమ్మిన జనాలకు మాత్రం అది జీవన్మరణ సమస్య. బతుకు సమస్య. అందుకే వారు దేన్ని సులువుగా మరచిపోలేరు.

తమ జీవితాలు బాగుపడతాయని అలా చకోర పక్షుల్లా ఎదురుచూస్తూనే ఉంటారు. డిసెంబర్ 23 కాదు మరో డేట్ అయినా చెప్పి కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చి చెప్పిన తీరున మూడు వేల మందికి ఉపాధి ఇస్తారా. అది జగన్ మరో ఏణ్ణర్ధం పదవీకాలంలో జరుగుతుందా. ఏమో అంతవరకూ ఈ డిసెంబర్ 23 మాత్రం జనాలకు పదిలంగా అలా మెదళ్లలో గుర్తుండిపోతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News