అమిత్ షాతో జగన్ : పెద్దాయనకు ఏం చెప్పారంటే....?

Update: 2022-06-03 15:30 GMT
కేంద్రంలో పెద్దాయన అంటే మోడీ తరువాత అమిత్ షాయే. ఆయనే సర్వం సహా అన్నట్లుగా ఉంటారు. ఆయన ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి కళ్ళూ ముక్కూ చెవులుగా చెప్పాలి. ప్రధానితో పాటు అమిత్ షాను కూడా కలిస్తేనే ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లు. అందుకే జగన్ ఒక రోజు రాత్రి ఢిల్లీలో బస చేసి మరీ అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు.

ప్రధానితో మాదిరిగానే అమిత్ షాతో కూడా నలభై అయిదు నిముషాల పాటు జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలు ప్రస్థావనకు వచ్చాయని అంటున్నారు. అదే విధంగా రాష్టపతి ఎన్నికు ప్రధానంగా చర్చకు వచ్చాయని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నిక జూలైలో ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టులో జరుగుతుంది.

ఈ రెండు ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు వైసీపీ అన్ కండిషనల్ గా మద్దతు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్నే అమిత్ షాకు జగన్ చెప్పారని అంటున్నారు. అదే సమయంలో సామాజిక సమతూకాన్ని పాటించి ఈ రెండు కీలకమైన పదవులకు అభ్యర్ధులను ఎంపిక చేయాలని జగన్ సూచించంట్లుగా తెలుస్తోంది.

అంటే అగ్ర వర్ణాలకు కాకుండా బీసీలు, మహిళలు, మైనారిటీల నుంచి పరిశీలించాలన్నదే జగన్ మనోగతమని అంటున్నారు. జగన్ చేసిన ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుంటే కనుక కొత్త రాష్ట్రపతి అగ్ర వర్ణాల నుంచి ఉండరనే అనుకోవాలి. ఇక జగన్ ఈ సూచన ఎందుకు చేశారు అన్న చర్చ కూడా ఇపుడు వస్తోంది.

ఏపీ నుంచి ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ఎం వెంకయ్యనాయుడు అగ్ర కులస్థులు. ఆయన  క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అసలు ఇష్టపడలేదు కానీ 2017లో మోడీ అమిత్ షా చేసిన వత్తిడి మీదనే ఆయన ఆ కీలకమైన పదవి చేపట్టారు అని అంటారు.

ఇక ఇపుడు సౌతిండియా  మీద బీజేపీ కన్ను వేసింది. అందునా తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేయాలనుకుంటోంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కీలకంగా ఉన్న వెంకయ్యనాయుడుని ప్రెసిడెంట్ చేస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది.  అయితే వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వం పట్ల వైసీపీ అంత సుముఖంగా ఉండడం లేదని అంటున్నారు.

ఆయన ఉప రాష్ట్రపతిగా అనేకసార్లు ఏపీకి వచ్చినా వైసీపీ అధినాయకులు వెళ్ళి కలసినది లేదు, ఇక ఏపీలో ఆంగ్లమీడియం బోధన పట్ల, ఉచిత పధకాల  పట్ల వెంకయ్యనాయుడు వీలైనపుడల్ల తన ప్రసంగాలలో ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నపుడు, పూర్వాశ్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగారు అన్నది కూడా వైసీపీ పెద్దలకు ఉంది.

దాంతో కీలకమైన పదవికి ఆయనను ఎంపిక చేయాలనుకుంటే మాత్రం వైసీపీ మద్దతు ఇస్తుందా అన్న చర్చ ఇంతవరకూ వచ్చింది. ఇపుడు అమిత్ షాతో జగన్ భేటీ సందర్భంగా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులను ఎంపిక చేయాలని సూచించారు అని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం కనుక నిజమైతే మాత్రం వెంకయ్యనాయుడు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినట్లే అంటున్నారు.

ఇక వెంకయ్యనాయుడు తప్ప ఎవరిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినా వైసీపీకి ఏ రకమైన అభ్యంతరాలు ఉండకపోవచ్చు. మరో వైపు చూస్తే బీజేపీ కూడా వెంకయ్యనాయుడు పేరుని పరిశీలించకపోవచ్చు అంటున్నారు. ఆ పార్టీ కూడా సామాజిక సమీకరణలనే చూస్తోందని అంటున్నారు. 2017లో అనూహ్యంగా రామ్ నాధ్ కోవింద్ తెర మీదకు వచ్చారు. ఇపుడు కూడా అలాగే మహిళకు కానీ మైనారిటీకి కానీ లేక బీసీలకు కానీ ఈ కీలకమైన పదవి కట్టబెట్టాలని చూస్తోందని అంటున్నారు. ఇక రాష్ట్రపతి పదవిని ఉత్తరాదికి ఇస్తే ఉప రాష్ట్రపతి పదవిని దక్షిణాదికి ఇస్తారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ అమిత్ షా తో భేటీ సందర్భంగా ఫుల్ సపోర్ట్ ఎన్డీయేకే అని చెప్పి వచ్చారు అని అంటున్నారు.
Tags:    

Similar News