విజయసాయిరెడ్డి ఆరోపణలపై ఆధారాలు ఇమ్మన్న రాజ్యసభ చైర్మన్‌!

Update: 2023-02-08 13:13 GMT
రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందులో కేంద్రం, న్యాయవ్యవస్థలు చొరబడటానికి వీల్లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆయన రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 రెండు, మూడు రాజధానుల ప్రధాన ఉద్దేశం పాలనా వికేంద్రీకరణే అని తేల్చిచెప్పారు. అధికారం ఒకేచోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలూ మిగతావాటితో సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే న్యాయ వ్యవస్థ ఓవర్‌రీచ్‌ వల్ల దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు దక్కకుండా పోయాయని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు.

ఆర్టికల్‌ 154 రెడ్‌ విత్‌ 163 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాజధానిని నిర్ణయించే అంశం పూర్తిగా కార్యనిర్వాహక పరిధిలోనిది కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోని అంశమేనని తేల్చిచెప్పారు. రాజధానిగా ఏ నగరం ఉండాలన్నది రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకోవచ్చని వెల్లడించారు. 2020 ఫిబ్రవరి 4న కేంద్ర హోంమంత్రి లోక్‌సభకు ఇచ్చిన ఓ సమాధానంలోనూ రాష్ట్ర భూభాగంలో రాజధానిని ఎంచుకొనే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని చెప్పారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో అయితే, హైకోర్టు అలహాబాద్‌లో ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌ అయితే హైకోర్టు బిలాస్‌పుర్‌లో ఉందని గుర్తు చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌పైనే ఎందుకు వివక్ష చూపుతున్నారని విజయసాయిరెడ్డి నిలదీశారు.

కాగా విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో జ్యుడిషియల్‌ ఓవర్‌రీచ్‌ అని వ్యాఖ్యలు చేయడంతో రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ జోక్యం చేసుకుంటూ జ్యుడిషియల్‌ ఓవర్‌రీచ్‌ గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాను చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. అలాగైతే దాన్ని  ధ్రువీకరించాలని జగదీప్‌ ధనఖడ్‌ కోరారు.

న్యాయవ్యవస్థ పరిధిని మించి వ్యవహరించిందని అనడం అంటే ఒక రకంగా కళంకం ఆపాదించడమేనని రాజ్యసభ చైర్మన్‌ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలిపారు. జ్యుడిషియల్‌ ఓవరరీచ్‌ అని అంటున్నప్పుడు దానికి ఆధారాలు చూపాలని విజయసాయిరెడ్డిని కోరారు. ఏ కారణంతో, న్యాయవ్యవస్థ ఇచ్చిన ఏ తీర్పు ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని సూచించారు. అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉందన్నారు. అయితే జగదీప్‌ ధనఖడ్‌.. విజయసాయిరెడ్డి వాదనతో ఏకీభవించలేదు. న్యాయ వ్యవస్థ హద్దు మీరిందని వ్యాఖ్యుల చేసినందుకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సభ ముందు ఉంచి నిరూపించాలని సూచించారు. దాంతో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. అందులో నాలుగు అంశాలున్నాయని, వాటన్నింటినీ వివరిస్తానని పేర్కొన్నారు. అయితే ఛైర్మన్‌ ధనఖడ్‌ మాత్రం డాక్యుమెంటు ఎక్కడని ఆయన్ను మళ్లీ ప్రశ్నించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News