జ‌గ్గారెడ్డి త‌ల దించుకున్న వేళ‌

Update: 2015-12-11 15:28 GMT
తూర్పు జ‌య‌ప్రకాశ్ రెడ్డి. ఈ పూర్తి పేరు కంటే మాస్ పేర‌యిన జ‌గ్గారెడ్డి ద్వారానే ఈ మాజీ ప్ర‌భుత్వ విప్ బాగా పాపుల‌ర్. టీఆర్ ఎస్ నుంచి వైఎస్ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా కాంగ్రెస్‌ లో చేరిన ఈ మాజీ ఎమ్మెల్యే గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫునే బ‌రిలో దిగి ఓడిపోయారు. కాలం క‌లిసివ‌చ్చి ఎంపీ ప‌ద‌వి ద‌క్కుతుందేమో అని మెద‌క్ పార్ల‌మెంటులో బీజేపీ త‌ర‌ఫున రంగంలోకి దిగినా చుక్కెదురు అయింది. దీంతో క‌మ‌లంలో ఇమ‌డ‌లేక తిరిగి హ‌స్తం పార్టీకి జై కొట్టారు. త‌న‌దైన డైన‌మిజంతో ముంద‌కువెళ్లే ఈ నేత తాజాగా త‌ల‌దించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వాపోతున్నాడు.

తెలంగాణలో టీఆర్ ఎస్ నిర్వ‌హిస్తున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు కాంగ్రెస్ - టీడీపీలు ఖాళీ అవుతున్న ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ దూకుడు పెరిగింది. పలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఏక‌గ్రీవం అయి గులాబీ ఖాతాలో జ‌మ‌య్యాయి. దీనిపై జగ్గారెడ్డి మండిపడ్డారు. మిగతా పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకునేలా చేసి తమ అభ్యర్థుల గెలుపును టీఆర్ ఎస్‌ ఏకగ్రీవం చేసుకుంటోంద‌ని విమ‌ర్శించారు. మెదక్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో తమ పార్టీకే మెజారిటీ ఉందని, కానీ ఇక్కడి తమ అభ్యర్థి టీఆర్ ఎస్ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరిపోయాడని వాపోయారు. టీఆర్ ఎస్‌ ఓటమి భయంతో తమ అభ్యర్థితో బ‌ల‌వంతంగా నామినేష‌న్‌ విత్ డ్రా చేయించిందని చెప్పారు. అధికారం ఉందనే అహంతో అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారని, ప్రలోభాలతో గెలవాలని టీఆర్ ఎస్ చూస్తోందని ఆరోపించారు.గెలుస్తామన్న నమ్మకంతోనే పోటీ పెట్టామని, కానీ ఇప్పుడు పార్టీ హైకమాండ్ కు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మెద‌క్‌ లో కాంగ్రెస్‌ కు కొండంత అండ‌గా ఉంటూ టీఆర్ ఎస్‌ ను ఎదురించ‌డంలో రొమ్మువిరుచుకొని నిల‌బ‌డే ఈ ఎమ్మెల్యేకే త‌ల‌వంపులు అయ్యే ప‌రిస్థితి వ‌చ్చిందంటే....కాంగ్రెస్ ప‌రిస్థితి తెలంగాణ‌లో ఏ రేంజ్‌ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.
Tags:    

Similar News