ఏంది పీసీసీ చీఫ్ పదవిలో అంత పవరుందా జగ్గారెడ్డి?

Update: 2021-06-03 08:30 GMT
మంది మార్బలం.. అంతకుమించిన ఆర్థిక దన్ను.. అంతులేని అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏమైనా చేసేయొచ్చని చాలామంది చెబుతారు. అదేం సిత్రమో కానీ.. అలాంటి అధికారం చేతిలో ఉంచుకొని ఏమీ చేయని అధినేతల్ని ఇప్పుడు మనం చూస్తేనే ఉన్నాం. కరోనాసెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. పాజిటివ్ బారిన పడినోళ్లు ఆసుపత్రుల వద్ద పడిన ఇబ్బందులు.. వారికి ఎదురైన చేదు అనుభవాలు.. రెమిడెసివర్ కోసం.. ఆక్సిజన్ కోసం.. ఇతర మందుల కోసం.. అంబులెన్సు సర్వీసుల కోసం ప్రజలు పడిన పాట్లు అన్నిఇన్ని కావు.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉన్నా.. ఏమీ చేయలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. అయితే.. అలా ప్రభుత్వమే చేయలేని ఎన్నో పనుల్ని తాను పీసీసీ చీఫ్ అయి ఉంటే చేసి ఉండేవాడినంటూ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల గుర్తుగా ఉస్మానియా.. గాంధీ ఆసుపత్రుల వద్ద రెండేసి చొప్పున మొత్తం నాలుగు అంబులెన్సుల్ని ఈ సర్కారు దవాఖానాల వద్ద ఏర్పాటు చేశారు.

పేదలు.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారు తాను ఏర్పాటు చేసిన అంబులెన్సుల్ని వాడుకోవాలన్న ఆయన.. తనను కానీ పీసీసీ చీఫ్ ను చేసి ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇదే తరహా అంబులెన్సుల్ని ఏర్పాటు చేసే వాడినని చెప్పారు. ఎంత ఖర్చు అయినా ఫర్లేదు.. అంబులెన్సుల్ని గ్రామాలకు తీసుకెళ్లటమే తన లక్ష్యమని చెప్పారు. గడిచిన కొద్దికాలంగా సా..గుతున్న పీసీసీ చీఫ్ పదవి రేసులో తను కూడా ఉన్నట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మిగిలిన చాలా మంది రేసులో ఉన్నట్లు చెప్పినా.. ఇలా డబ్బుల్ని ఖారీగా ఖర్చు చేసి రేసులో ఉన్నట్లుగా చెప్పటం జగ్గారెడ్డికి మాత్రమే చెల్లు. ఇంతకూ అంత ఖర్చు పెట్టేంతగా పీసీసీ చీఫ్ పోస్టులో ఏముంది జగ్గారెడ్డి?
Tags:    

Similar News