హైదరాబాద్ లో తలసాని సీన్ ఎంతో చెప్పిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్

Update: 2020-05-09 05:50 GMT
ప్రత్యర్థిని పొగడటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఎదుటోడు ఎంతటి మొనగాడైనా.. వారిని పొగడటం.. వారి గొప్పతనాన్ని కీర్తించటం.. వీరత్వాన్ని ప్రశంసించటం లాంటివి కనిపించవు. అందునా.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నోళ్లకు అసలే సాధ్యం కాదు. కానీ.. అందుకు భిన్నమైన రీతిలో వ్యవహరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైనికులు జీతాల కోసం పని చేస్తారన్న మాటను పుసుక్కున అనేసిన తలసానిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్ ను రగిల్చే అవకాశం ఇచ్చిన తలసాని విమర్శపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటివేళ.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

హైదరాబాద్ లో తలసాని ఎంత పవర్ ఫుల్లో అన్న విషయాన్ని ఆయన మాటల్లో చెప్పేయటం విశేషం. తమ రాజకీయ ప్రత్యర్థి ఎంత తోపు అయినా.. ఆ విషయాన్ని మాట వరసకు ఒప్పుకోవటం కనిపించదు. అందుకు భిన్నంగా జగ్గారెడ్డి మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకుంటూనే.. తన రేంజ్ ఏమిటో చెప్పకనే చెప్పేశారు.

హైదరాబాద్ లో మంత్రి పహిల్వాన్ గిరీ చేయొచ్చు. ఇక్కడ నేను ఆయన్ను ఏమీ చేయలేకపోవచ్చు. టైం బాగోలేక ఆయన సంగారెడ్డికి వస్తే.. అక్కడ నాది నడుస్తుందన్నారు. హైదరాబాద్ లో తలసానికి తిరుగులేదన్న విషయాన్ని ఒప్పేసుకునేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీలో అంతా చదువుకున్నోళ్లే ఉండటం పెద్ద సమస్యగా మారిందన్నట్లుగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

తమ దురదృష్టం ఏమంటే.. కాంగ్రెస్ పార్టీలో అంతా చదువుకున్న వారే ఉన్నారని.. ఎవరికి తిట్లు రావన్న జగ్గారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్ లు పాస్ పోర్టు కేసుల్లో ఉన్నారన్నారు. వారిని అరెస్టు చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
Tags:    

Similar News