ఎంపీకి అంత ద‌మ్ముందా అంటున్న జ‌గ్గారెడ్డి

Update: 2017-06-03 16:54 GMT
కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న అధికార టీఆర్ ఎస్‌ పార్టీ - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య వాదోప‌వాదాల‌కు వేదిక‌గా మారింది. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత కాంగ్రెస్ నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భతో కాంగ్రెస్ నేత‌ల్లో ఉత్సాహం రాగా...టీఆర్ ఎస్ నేత‌లు త‌మ ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబానికి స‌న్నిహితుడ‌నే పేరున్న టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. లేకుంటే ఆయనకు గుండు కొట్టించి తిప్పాల్సి వస్తుందని హెచ్చ‌రించారు.

టీఆర్ ఎస్‌ ఎంపీ బాల్కసుమన్ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి తిప్పికొట్టారు. తనను ముట్టుకుని గుండు కొట్టించేంత దమ్ము బాల్క సుమన్‌ కు ఉందా అని జగ్గారెడ్డి మీడియా ముఖంగా ప్రశ్నించారు. బాల్క సుమన్‌ ఓ బచ్చా అని, ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయని మండిప‌డ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ దగ్గర మార్కులు కొట్టేయడానికే సుమన్‌ ఇద్దరు విద్యార్థులను బలితీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ హత్య కేసుల్ని తేలుస్తామని స్ప‌ష్టం చేశారు. ఓయూలో కేసీఆర్‌ తో సభ పెట్టించే దమ్ము బాల్కసుమన్‌ కు ఉందా అని జ‌గ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు.

మీడియాతో సుమ‌న్ మాట్లాడుతూ టీఆర్‌ ఎస్ పెద్ద నాయకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తే మీడియాలో వస్తామనే ఉద్దేశంతో ఇష్టారీతిన మాట్లాడితే సహించబోమ‌ని అన్నారు. ప్రజలకు అండగా నిలిచి భరోసా కల్పించడానికి అనేక స్కీంలు ప్రవేశపెట్టిన చరిత్ర టీఆర్‌ ఎస్ ప్రభుత్వానిది  అయితే..స్కాంలు చేసిన ఘతన కాంగ్రెస్‌దని ఎద్దేవా చేశారు. కుటుంబ రాజకీయాల గురించి రాహుల్‌గాంధీ - కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిప‌డ్డారు. రాహుల్‌ గాంధీతో స్థానిక కాంగ్రెస్ నాయకులు తప్పులు - అబద్ధాలు చెప్పించి నవ్వులపాలు చేశారని అన్నారు. కాంగ్రెస్‌ లోనే కుటుంబపాలన ఉంద‌ని కేసీఆర్ కుటుంబం ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిందని వివ‌రించారు. కాంగ్రెస్ నాయకులకు అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం, ప్రతిపక్షంలో ఉంటే మైక్‌ల కోసం పోటీపడటం అలవాటయిందని ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News