కేసీఆర్‌పై ఇలాంటి సెటైర్ ఈ మ‌ధ్య కాలంలో చూడ‌లేదు

Update: 2020-05-14 16:20 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఎప్పుడు విరుచుకుప‌డ‌తారో..ఎప్పుడు విమ‌ర్శ‌లు ప‌క్క‌న పెట్టి ప్ర‌శంస‌లు కురిపిస్తారో తెలియ‌కుండా త‌న‌దైన శైలిలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తాజాగా మ‌రోమారు ఆ మార్క్ ప్ర‌ద‌ర్శించారు. ఈ ద‌ఫా టీఆర్ఎస్ అధినేత‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవ‌లే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనే పేర్కొంటూ ఒక‌వేళ అలా చేయ‌క‌పోతే రైతుబంధు ప‌థ‌కం వ‌ర్తించ‌బోద‌ని ప్ర‌క‌టించారు. దీనిపై జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ఎన్నికల ముందు రైతుబంధు పేరు మీద ఓట్లు దండుకున్న‌ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాజకీయాలు చేస్తోందని అన్నారు.

రైతుల విష‌యంలో తెలంగాణ‌ కేసీఆర్ విధానం స‌రికాద‌ని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌య‌లో కేసీఆర్ రైతులను కొండెక్కించారని పేర్కొన్న జ‌గ్గారెడ్డి తెలంగాణ వ‌చ్చి ఆరేళ్ళు అవుతున్నా రైతుల మొహాలలో సంతోషం లేని ప‌రిస్థితి సృష్టించార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంటనష్టం జ‌రిగింద‌ని, రైతుల‌కు గిట్టుబాటు ధర కూడా క‌ల్పించ‌లేదని అన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు పేరుమీద ఓట్లు దండుకొని టీఆరెస్ రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఎకరానికి ఐదు వేలు ఇస్తా అన్న కేసీఆర్.. ఇప్పటికి వరకు రైతులకు పూర్తిగా రైతుబంధు ఫ‌లితాలు అందించ‌డం లేద‌ని ఆరోపించారు.

ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనే తాజాగా సీఎం కేసీఆర్ నిబంధన పెట్ట‌డం చూస్తుంటే... రైతు బంధు వదిలించుకునే ప్రయత్నమే జ‌రుగుతున్న‌ట్టు అనిపిస్తోందని జ‌గ్గారెడ్డి అ‌న్నారు. గ‌త ఏడాది రైతు బంధు 60 శాతం రాలేదని, ఈ ఏడాది అస‌లు వస్తుందా? రాదా? అనేది కూడా ఎవ్వరికి తెలియ‌దని జ‌గ్గారెడ్డి అ‌న్నారు. రైతు బంధు లానే రేపు తాను చెప్పిన పిల్లనో ,పిలగాన్నో చేసుకోకపోతే కళ్యాణ లక్ష్మీ కూడా ఇవ్వనంటాడోమోన‌ని జ‌గ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతా..? లేక రాజకీయ నాయకుడా? సమాధానం చెప్పాలని జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Tags:    

Similar News