నాటకాలు కట్టిపెట్టండి జైరాం జీ!

Update: 2018-02-19 06:07 GMT
‘ఎద్దుపుండు కాకికి ముద్దు’ అని సామెత! ఒకవైపు ప్రత్యేకహోదా మంటగలిసిపోయి.. పాలుకులు ప్యాకేజీ పేరిట దిగజారితే.. ఆ సొమ్ములు కూడా సకాలంలో సరైన రీతిలో రాకుండా.. కుములుతున్న ఏపీ ప్రజలకు మరింత కడుపుమండేలా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్.. కొత్త రకం మాటలతో విషయాన్ని దారిమళ్లించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన మాటలు విన్న ప్రజలు మాత్రం.. చేసిన ద్రోహం చాలు.. కొత్త నాటకాలు కట్టిపెట్టండి జైరాం గారూ అని మొత్తుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడింత నికృష్టమైన పరిస్థితుల్లో ఉండడానికి కారణమైన అరాచక విభజన తీరుకు ప్రధాన నిందితుల్లో జైరాం రమేష్ కూడా ఒకరు. ఆయన ఆనాడు రాష్ట్ర విభజన వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అత్యంత ఘోరంగా విభజించారు. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సమాధి అయిపోయిందో.. అదే రకంగా విభజన పాపానికి బాధ్యులైన వారికి ఈ రాష్ట్రం కాలు పెట్టాలంటే కూడా భయమేసే పరిస్థితి ఏర్పడి ఉండాల్సింది. కానీ.. ఏపీ ప్రజలు సౌజన్యశీలురు కాబట్టి.. జైరాం లాంటి వాళ్లు ఇంకా తిరుపతి లాంటి ప్రదేశాలకు వచ్చి కొత్త నాటకాలు షురూ చేయగలుగుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ఇంతకూ జైరాం ఏం చెబుతున్నారంటే.. 14వ ఆర్థికసంఘం ప్రత్యేకహోదా వద్దు అనే ఎప్పుడూ చెప్పలేదని అంటున్నారు. హోదా కావాలంటే.. విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ.. తెదేపా గానీ - వైసీపీ గానీ సభలో బిల్లు పెట్టవచ్చునని అంటున్నారు.

ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడడం ఎందుకు.. జైరాంకు ఏపీ మీద అంత ప్రేమే ఉంటే గనుక.. కాంగ్రెస్ పార్టీ తరఫున విభజన చట్టానికి సవరణ బిల్లును ప్రతిపాదించవచ్చు కదా.. ఏపీలో వారికి ప్రాతినిధ్యం లేకపోయినంత మాత్రాన సవరణ బిల్లు పెట్టకూడదనే చట్టం ఏమీ లేదు కదా! అలా ప్రతిపాదించడం ద్వారా తాము చేసిన పాపాన్ని వారే కడిగేసుకోవచ్చు కదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. జైరాం అచ్చంగా నాటకాలు ఆడుతున్నారు తప్ప.. ఇవేవీ రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు కాదనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News