ఎస్‌...భానుకిర‌ణ్ గెలిచాడు

Update: 2016-07-02 10:28 GMT
మ‌ద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్ త‌న పంతం నెగ్గించుకున్నాడు. అదికూడా పోలీసుల‌పై సాధించిన‌ట్లుగా టాక్ న‌డుస్తుండ‌టం విశేషం. సూరి హత్యకేసులో భాను కిరణ్ నాలుగేళ్లుగా చర్లపల్లి జైల్లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే జైలు నుంచి దందాలు చేయటం.. అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేయటం.. తన ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో ఆయ‌న్ను  వేరే కారాగారానికి మార్చాల‌ని ఏకంగా పోలీసులే విన‌తి పెట్టుకున్నారు. దానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి ఆయ‌న్ను జైలు నుంచి మార్చేందుకు  నాంపల్లి కోర్టు అనుమ‌తిచ్చింది.

చర్లపల్లి జైల్లో ఉన్న భాను కిరణ్ ను భరించటం తమ వద్దకాదని చర్లపల్లి జైలు అధికారులు కోర్టులో పిటిషన్ వేసిన సంగ‌తి తెలిసిందే. జైళ్లోనే ఉండి దందాలు చేయ‌డంతో పాటు అధికారుల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌ట‌మే కాకుండా ఇత‌ర ముఠాల‌తో కూడా సంబంధాలు ఉన్న‌ట్లు తేలింది. ఇటీవలే ప‌ట్టుకున్న‌ కోహ్లీ గ్యాంగ్‌ ను విచారిస్తున్న క్రమంలో వారి వెనుక భాను కిరణ్ ఉన్నట్లు తేలింది. మ‌రోవైపు భానును ఎలా క‌ట్ట‌డి చేయాలో అర్థం కాని ప‌రిస్థితుల్లో జైలు మార్చివేయాలంటూ  పోలీస్ అధికారులు కోర్టులో పిటిష‌న్ వేశారు. దీంతో నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అధికారులు భానుకిరణ్‌ కు చంచల్‌ గూడ జైలులో ప్రత్యేక బ్యారక్‌ ను సిద్ధం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ త‌ర‌లింపునకు పోలీసులు కొత్త పేరు పెట్టారు. భానుకు ప్రాణహాని ఉండటంతో ఈ త‌ర‌లింపు చేప‌ట్టిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Tags:    

Similar News