పోటుగాడిన‌ని చెప్పుకునే దుస్థితేంది జైపాల్‌ సాబ్‌

Update: 2015-09-08 09:04 GMT
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. పూలు అమ్మిన చోటే క‌ట్టెలు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి రావ‌టం రాజ‌కీయాల్లో మామూలే. యూపీఏ స‌ర్కారు కేంద్రంలో రాజ్యం ఏలుతున్న రోజుల్లో.. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ కాంగ్రెస్సే ప‌వ‌ర్ లో ఉండ‌టం.. అప్ప‌టి కాంగ్రెస్ నేత‌ల హ‌వా ఓ రేంజ్‌ లో సాగిన సంగ‌తి తెలిసిందే.

ఓట‌మితో పాటు.. స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌టంతో చెట్టుకొక‌రు.. పుట్ట‌కొక‌రుగా మారిపోయిన ప‌రిస్థితి కానీ.. ప‌వ‌ర్ కాని ఉంటే త‌మ‌కు మించిన మొన‌గాడు లేడ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు మాత్రం త‌మ‌కో లీడ‌ర్ కావాల‌ని తెగ ఆరాట‌ప‌డిపోతున్నారు. ఇక‌.. మ‌రో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఏమిటంటే.. కేంద్రంలో చ‌క్రం తిప్ప‌ట‌మే కాదు.. ఇప్ప‌టి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం విప‌రీతంగా పొగిడేసిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌.. మేధావిగా పేరొందిన జైపాల్ రెడ్డి త‌న గొప్ప‌త‌నాన్ని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి.

ఇప్పుడు ఎలా అయితే.. తెలుగువారంద‌రికి ఢిల్లీ వెళితే వెంక‌య్య‌నాయుడు పెద్ద దిక్కుగా ఉంటున్నారో.. యూపీఏ హ‌యాంలో జైపాల్‌ రెడ్డి ఇంటి చుట్టూ నేత‌లు తిరిగేవారు. అధికార‌ప‌క్షం వారే కాదు.. విప‌క్ష నేత‌లు కూడా అప్పుడ‌ప్పుడు గుట్టుచ‌ప్పుడు కాకుండా వ‌చ్చిపోతుండేవారు.

అలా త‌న హ‌వా న‌డిపిన ఆయ‌న ఇప్పుడు రోడ్డు మీద‌కు వ‌చ్చేసి.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం తానెంత క‌ష్ట‌ప‌డ్డాన‌న్న విష‌యాన్ని చెప్పుకోవ‌టం అంతే ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు.

తెలంగాణ స‌ర్కారు గురించి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న‌.. తాజాగా త‌మ ఎమ్మెల్యేను జెడ్పీ స‌మావేశంలో కొట్ట‌టాన్ని ఖండిస్తూ ఏర్పాటు చేసిన ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ సాధ‌న కోసం తానెంత క‌ష్ట‌ప‌డింది చెప్పుకున్నారు. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే. .తెలంగాణ సాధ‌న‌లో జైపాల్ రెడ్డి  పాత్ర‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ.. తెలంగాణ సాధ‌న కోసం తానెంత క‌ష్ట‌ప‌డింది.. తానెంత పోటుగాడిన‌న్న విష‌యాన్ని ఆయ‌న‌కు ఆయ‌నే చెప్పుకోవాల్సిన దుస్థితి చూసినప్పుడు.. రాజ‌కీయాల్లో ఏది శాశ్వితం కాద‌న్న‌విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.
Tags:    

Similar News