కేసీఆర్ దీక్ష గుట్టు విప్పుతానంటున్న జైపాల్‌ రెడ్డి

Update: 2015-11-18 09:19 GMT
నిన్న‌టి వ‌ర‌కూ ఓ మోస్త‌రు ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌ల‌తో సాగిన వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ప్ర‌చారం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. మంగ‌ళ‌వారం హ‌న్మ‌కొండ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ఇక‌.. మాజీ కేంద్ర‌మంత్రి జైపాల్ రెడ్డి అయితే ఓ రేంజ్ లో అగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ద‌వుల కోసం తాను క‌క్కుర్తిప‌డిన‌ట్లుగా.. కేసీఆర్ అభివ‌ర్ణించ‌టాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన జైపాల్ రెడ్డి.. త‌న‌కుప‌ద‌వుల మీద ఆశ లేద‌న్నారు. తాను కానీ.. కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఉంటే.. తెలంగాణ వ‌చ్చేది కాద‌న్న ఆయ‌న‌.. త‌న‌కు ఉమ్మ‌డిరాష్ట్రంలో ముఖ్య‌మంత్రి ప‌దవిని చేప‌ట్టే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ తాను ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌లేద‌ని.. తెలంగాణ సాధ‌న కోస‌మే తాను ఆ ప‌ద‌విని వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా కేంద్ర‌మంత్రి ప‌ద‌వి చేయ‌లేద‌ని కేసీఆర్ అంటున్నార‌ని.. ఒక‌వేళ తాను కానీ మంత్రి ప‌ద‌వి కానీ వ‌ద్ద‌ని అనుకుంటే.. హైద‌రాబాద్ తో కూడిన తెలంగాణ వ‌చ్చేది కాద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌రంగ‌ల్ లో త‌మ పార్టీ అభ్య‌ర్థి ఓడిపోతార‌న్న భ‌యంతోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. తాను ఉద్య‌మంలో భాగంగానే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేద‌న్న జైపాల్ రెడ్డి.. కేసీఆర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

కేసీఆర్ చేసిన దీక్ష ఎలాంటిదో అంద‌రికి తెలుస‌న్నారు. దీక్ష మొద‌లుపెట్టిన కేసీఆర్ మ‌ధ్య‌లో ఎందుకు విర‌మించారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జాసంఘాల‌కు భ‌య‌ప‌డి దీక్ష‌ను మ‌ళ్లీ చేప‌ట్టార‌న్నారు. దీక్ష మ‌ర్మాన్ని తాను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన జైపాల్‌.. తెలంగాణ సాధ‌న‌లో కాంగ్రెస్ పాత్ర చాలానే ఉంద‌న్నారు. అస‌త్యాలు.. ఉహ‌కు అంద‌ని అబ‌ద్ధాల చెప్పి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చార‌ని మండిప‌డ్డారు. అయినా.. విమ‌ర్శ‌లు చేయ‌టానికి.. ఆరోప‌ణ‌లు చేయ‌టానికి.. గుట్టు విప్ప‌టానికి ఎన్నిల‌కు మించిన స‌మ‌యం వేరొక‌టి ఉంటుందా? కేసీఆర్ దీక్ష‌లో నిజంగా మ‌ర్మం ఉంటే.. ఆధారాల‌తో ఎన్నిక‌ల వేళ‌నే జైపాల్ రెడ్డి బ‌య‌ట‌పెడితే స‌రిపోతుంది క‌దా..?
Tags:    

Similar News