జైపాల్‌ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్...!?

Update: 2018-11-20 05:07 GMT
జైపాల్‌ రెడ్డి. తెలంగాణలో సీనియర్ నాయకుడు. అంతేకాదు జాతీయ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నాయకుడు. రాష్ట్రంలోనూ - కేంద్రంలోనూ కీలక పదవులు పోషించిన నాయకుడు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికైన నాయకుడు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించిన కొన్నాళ్ల వరకూ టీవీల్లో కనిపించారు. వినిపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై నిప్పులు చెరిగారు. అన్నట్లు తెలంగాణ తన వల్లే వచ్చిందని - తానే సోనియాగాంధీ చెప్పి తెలంగాణ తీసుకువచ్చానని కూడా ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే ఆయన కనిపించకుండా పోయారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల జోరు పెరగడం - తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలని ప్రతిపక్షాలైన కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సీపీఐ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడడానికి ప్రయత్నాలు జరిగాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. బద్దశత్రువులైన ఈ రెండు పార్టీలు కలవడం అటు జాతీయ స్ధాయిలోను - ఇటు రాష్ట్ర స్ధాయిలోనూ కూడా చర్చనీయాంశమైంది.

మరోవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మమతా బెనర్జీ - చంద్రబాబు నాయుడు - దేవెగౌడ వంటి వారు కలుస్తున్నారు.  జాతీయ స్ధాయిలోను - తెలంగాణలోనూ ఇంత రాజకీయ హడావుడి జరుగుతున్నా జైపాల్‌ రెడ్డి  మాత్రం ఊసులో ఎక్కడా లేరు. వివిధ పార్టీల నాయకులందరితోనూ పరిచయాలు ఉన్న జాతీయ నాయకుడు జైపాల్ రెడ్డి మాత్రం ఎక్కడ వినిపించడం లేదు.... కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై నిప్పులు చెరిగిన జైపాల్ రెడ్డి ఆ తర్వాత మాత్రం ఏమైపోయారో కాంగ్రెస్ పార్టీ వారికే తెలియకుండా పోయింది. అంతే కాదు.... తెలంగాణలో అభ్యర్ధుల ఎంపిక - ప్రచారం హోరెత్తినా ఆయన పేరు మాత్రం వినిపించడం లేదు. సీనియర్ నాయకుడిగా ఆయన వర్గీయులకు టిక్కట్ల ఇవ్వడం వంటి అంశాలు కూడా ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. దీంతో జైపాల్ రెడ్డి ఇక శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏమో ఎన్నికల వరకూ కామ్ గా ఉండి.... ఎన్నికల్లో మహాకూటమి గెలిస్తే అప్పుడు జైపాల్ రెడ్ది మళ్లీ తెరపైకి వస్తారా అనే అనుమానాలూ వస్తున్నాయి. ఏమో... కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగవచ్చు.

Tags:    

Similar News