అమీర్ ఖాన్ గజ్జి జైపాల్ రెడ్డికి అంటుకుంది

Update: 2015-11-27 08:42 GMT
'దారినపోయే కంపను తగిలించుకోవడం' అన్న సామెత ఒకటుంది.. తెలివైనవారు సాధారణంగా ఇలాంటివి తగిలించుకోరు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ లో తెలివైనవాడిగా, వివాదరహితుడుగా పేరున్న పెద్దమనిషి జైపాల్ రెడ్డి ఆచితూచి మాట్లాడుతారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పేరున్న ఆయన అధిష్ఠానం కోసం కొన్నిమాటలు ఆడాల్సివచ్చినా అవి అక్కడే మాట్లాడుతారు కానీ అందరిలో మాట్లాడారు. ఎందుకో తెలియదు కానీ, ఆయన కూడా కాస్త తొందరపడ్డారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో దేశమంతా రచ్చరచ్చగా మారిన సందర్భంలో ఆయన తగుదునమ్మా అంటూ అమీర్ కు మద్దతు పలికారు. దీంతో జైపాల్ పైనా ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా అయితే... ఆయన్ను ఏకిపడేస్తోంది.

దేశంలో అసహనం ఉందంటూ ఎందరో మాట్లాడుతున్నారు. వారందరినీ దేశం తిట్టడం లేదు.. వారి వ్యాఖ్యలపై మండిపడడం లేదు. అసహనం ఉంది అన్నంత మాత్రాన ఆ వ్యాఖ్యలను తప్పు పట్టడం లేదు. అలా అంటున్న వ్యక్తులెవరు..? అసహనం ఉంటే వారు ఇంతవారయ్యేవారా? ఈ దేశం వారిని ఎలా చూసుకుంది..? నెత్తిన పెట్టుకున్న దేశాన్ని అవమానించేలా మాట్లాడుతారా అంటూ కొందరిపైనే ప్రజలు మండిపడుతున్నారు. అమీర్ ఖాన్ కూడా అలాంటివారే. అలాంటి అమీర్ కు మద్దతు పలికి జైపాల్ కూడా అపఖ్యాతి పాలవుతున్నారు.

జైపాల్ స్వయంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసి ఉంటే ఎవరూ ఏమీ అనేవారు. కాదు... దేశంలో అసహనం ఉందని ఆయన అన్నంత మాత్రాన ఆయన్నెవరూ ఏమీ అనేవారు కాదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ అధిష్ఠానానికి సన్నిహితుడుగా పార్టీ విధానాన్ని వ్యక్తపరిచాడని అనుకునేవారు. కానీ, అమీర్ ఖాన్ కు మద్దతు పలికేటప్పటికి జైపాల్ పై అంతా మండిపడుతున్నారు. అమీర్ ఖాన్ తన ప్రకటనపై వివరణ ఇవ్వనవసరం లేదని జైపాల్ అనడం తగదన్న భావన అందరి నుంచి వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News