పచ్చి నిజం; జనం చెప్పే మాటే జైరాం రమేష్ నోట

Update: 2016-07-18 06:26 GMT
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు.. ఉమ్మడి రాష్ట్రంలోని నాటి పరిస్థితుల గురించి ఏ మాత్రం తెలిసిన వారూ తరచూ ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. రాష్ట్ర విభజన అన్నది జరగాల్సింది కాదని.. తెలుగు మాట్లాడే ప్రజలంతా కలిసి ఉండాల్సి ఉన్నా.. అలాంటిది జరగలేదన్న వేదనను వ్యక్తం చేస్తుంటారు. ఈ సందర్భంగా అటు తెలంగాణవాదులు కానీ.. ఇటు సమైక్యవాదులు కానీ ఒక మాటను పదే పదే ప్రస్తావిస్తుంటారు.

అదేమంటే.. నాడు చంద్రబాబు క్యాబినెట్ లో కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉన్న పక్షంలో కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీని పెట్టటం కానీ.. ఎప్పుడో ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపి.. పీక్ స్టేజ్ కి తీసుకురావటమే కాదు.. చివరకు తెలంగాణ రాష్ట్రం రావటం లాంటివేమీ జరిగి ఉండేవి కావని చెబుతుంటారు.

ఒక్క కేసీఆర్ మాత్రమే కాదని.. మరో కీలక పరిణామం కూడా రాష్ట్ర విభజనకు కారణమైందన్న మాట చెబుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ మరణించి ఉండని పక్షంలో రాష్ట్ర విభజన అనేది జరిగి ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. సామాన్యులు మాట్లాడుకునే మాటల్నే రాష్ట్ర విభజన విషయంలో కీలక భూమిక పోషించిన జైరాం రమేశ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం. తాను ప్రస్తావించిన రెండు అంశాల్లో ఏది ఒక్కటి జరిగి ఉన్నా ఈ రోజు రాష్ట్రవిభజన జరిగి ఉండేది కాదని జైరాం చెప్పుకొచ్చారు.

విభజనపై ఆయన రచించిన పుస్తకానికి సంబంధించిన తెలుగు రూపమైన ‘గడిచిన చరిత్ర’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ కు రెడ్డి వర్గం దూరమైందన్న కీలక వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. కాకుంటే.. ఆ విషయాన్ని సూటిగా కాకుండా తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 90 శాతం రెడ్డి వర్గీయులు తమతో (కాంగ్రెస్) ఉండేవారని.. వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాలతో ఆ వర్గం తమకు దూరమైందన్న భావన వచ్చేలా జైరాం వ్యాఖ్యానించటం గమనార్హం. తమతో ఉన్న వారిని కాంగ్రెస్ దూరం చేసుకోవటంతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న ఆయన కులాల గురించి అంతకంటే ఎక్కువగా మాట్లాడలేనంటూ ముక్తాయించటం చూసినప్పుడు.. జగన్ కాంగ్రెస్ వీడిపోవటం వల్ల జరిగిన నష్టాన్ని జైరాం చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News