మోడీకి అధికారం కల్ల.. కాంగ్రెస్ ప్లాన్ ఇదేనట..

Update: 2018-06-04 12:30 GMT
ఏమో అనుకున్నాం కానీ రాహుల్ గాంధీ టీం ప్లాన్ చూశాక ఇప్పుడందరూ బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండో అత్యధిక సీట్లు సాధించినా కూడా తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కు మద్దతిచ్చి అధికారాన్ని పంచుకుంది. కాంగ్రెస్ సీనియర్లు ఎంతో చాకచక్యంగా ఇక్కడ దిగి ఎమ్మెల్యేలు జారిపోకుండా బీజేపీని కట్టడి చేసి గెలిచారు. కర్ణాటక విషయంలో బీజేపీ ఎంత అభాసుపాలైందో వేరే చెప్పనక్కర్లేదు..

అయితే కాంగ్రెస్ ఇప్పుడు మారిపోయిందని.. కర్ణాటకలో గెలుపు చూశాక మా పార్టీలో వచ్చిన పరిణతిని గమనించాలని.. తాజాగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.  ఢీల్లీలో విలేకరులతో మాట్లాడిన జైరాం పలు సంచలన విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టిన అనంతరం కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న మార్పులను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రధానకార్యదర్శులు సహా ఇతర కీలక పదవుల్లో పార్టీ నాయకత్వం యువ నేతలను నియమిస్తోందని చెప్పారు. సీనియర్లను మార్గదర్శకులుగా.. యువనేతలను కార్యదీక్షితులుగా కాంగ్రెస్ తీర్చిదిద్దుతోందని అన్నారు.

మణిపూర్ - గోవా - అరుణాచల్ ప్రదేశ్ లలో మాదిరిగా కాకుండా కర్ణాటకలో బీజేపీయేతర సర్కార్ ఏర్పాటుకు వేగంగా పావులు కదిపిందని.. కానీ రాహుల్ గాంధీ అప్రమత్తత వల్లే కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం  ఏర్పాటైందని జైరాం రమేష్ పేర్కొన్నారు.  2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ప్లాన్ వేసిందని.. ఈ ప్లాన్ తో బీజేపీకి అధికారం కల్ల అని స్పష్టం చేశారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ ఎల్డీలతో జతకడుతుందని.. బీహార్ లో ఆర్జేడీతో - జార్ఖండ్ లో జార్ఖండ్ వికాస్ మోర్చాతో - మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తు ఉంటుందని జైరాం స్పష్టం చేశారు. అవసరమైతే ఎన్నికల అనంతరం కూడా పొత్తులు పెట్టుకొని 2019లో బీజేపీని అధికారంలో రాకుండా ప్లాన్ చేసినట్టు జైరాం సంచలన విషయాలు వెల్లడించారు.

ఇలా అందరూ ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ పార్టీని ఎలా పటిష్టం చేస్తున్నారో.. ఎలాంటి వ్యూహాలు రచించాడనే దానిపై జైరాం సవివరంగా చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ప్రాంతీయపార్టీలకు ప్రస్తుతం  టార్గెట్ అయిన మోడీ వచ్చేసారి గెలవడం కష్టమేనన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News