జ‌గ‌న్ స‌త్తాపై జ‌లీల్ ఖాన్ మాట ఇదే!

Update: 2017-04-18 11:05 GMT
జ‌లీల్ ఖాన్‌... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌ పై విజ‌యం సాధించి ఆ త‌ర్వాత టీడీపీలోకి చేరిపోయిన నేత‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు చిర‌ప‌ర‌చితులే. ఈ ఒక్క కార‌ణంతోనే ఆయ‌న పాపుల‌ర్ అయిపోలేదు. బీకామ్‌ లో ఫిజిక్స్ ఉంటుంద‌ని వ్యాఖ్యానించిన కార‌ణంగానే ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఓ రేంజిలో పాపులారిటీ వ‌చ్చేసింది. ఇప్పుడు ఏ మీడియా ప్ర‌తినిధి ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసినా.. బీకామ్‌ లో ఫిజిక్స్ ఉంటుందా?,  ఉండ‌కుంటే ఆ వ్యాఖ్య ఎలా చేశారంటూ ప్ర‌శ్నించ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. అయితే ఓ రాజ‌కీయ నేత‌గా ఆ త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌ను పంటి బిగువున‌నే భ‌రిస్తూ వ‌స్తున్న జ‌లీల్ ఖాన్‌ కు ఈ నెల 2న టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెద్ద దెబ్బే కొట్టారు. మంత్రివ‌ర్గ పున‌ర్వవ‌స్థీక‌ర‌ణ‌లో జ‌లీల్ ఖాన్ కు మినిస్ట‌ర్ పోస్ట్ గ్యారెంటీ అంటూ ఆయ‌న‌అనుచ‌రులతో పాటు రాష్ట్రంలోని మైనారిటీలు కూడా భావించారు. అయితే ఊహించ‌ని విధంగా జ‌లీల్ ఖాన్‌కు రిక్త హ‌స్త‌మిచ్చిన చంద్ర‌బాబు... జ‌లీల్ ఖాన్ త‌ర్వాత పార్టీలో చేరిన న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులిచ్చారు.

ఈ క్ర‌మంలో ఇత‌ర తెలుగు త‌మ్ముళ్ల మాదిరే జలీల్ ఖాన్ కూడా తీవ్ర నిరాశ‌కు గుర‌వ‌డంతో పాటు అనుచ‌రుల‌తో స‌మావేశాలు పెట్టి మ‌రీ త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై స‌మీక్షించుకున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో జ‌లీల్ ఖాన్ చాలా విష‌యాల‌నే ప్ర‌స్తావించారు. బీకామ్ ఫిజిక్స్ నుంచి జ‌గ‌న్‌ కు న‌మ్మ‌క ద్రోహం చేసిన వైనం - స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల‌పై తాను స్పందించ‌బోనంటూనే క‌ర్రా బిళ్లా ఆడేస్తానంటూ... చాలా విష‌యాల‌నే ఆయ‌న ప్ర‌స్తావించారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌పోవ‌డానికి సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లే కార‌ణ‌మ‌ని చెప్పిన జ‌లీల్‌... భ‌విష్య‌త్తులో త‌న‌కు త‌ప్ప‌కుండా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎంత ధీమా వ్య‌క్తం చేసినా కూడా... జ‌లీల్ ఖాన్ మోములో మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న అసంతృప్తి మాత్రం కొట్టొచ్చిన‌ట్లుగానే క‌నిపించింది.

త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డం మొత్తం మైనారిటీల‌కు జ‌రిగిన అన్యాయంగానే ప‌రిగ‌ణించిన‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌కు అన్యాయం జ‌రిగితే... మొత్తం మైనారిటీల‌కు అన్యాయం జ‌రిగిన‌ట్లుగానే భావించాల్సి ఉంటుంద‌ని కూడా ఆయ‌న ఓ ఆస‌క్తిక‌ర వాద‌న వినిపించారు. అయితే ఈ త్వ‌ర‌లోనే మైనారిటీల‌కు చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే న్యాయం చేస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని తెలిపారు. బీకామ్‌ లో ఫిజిక్స్ ఉందంటూ తాను అన‌ని మాట‌ను ప్ర‌సారం చేసిన మీడియా కార‌ణంగానే త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని కొంద‌ర‌న్నార‌ని, అయితే అది నిజం కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక పార్టీ ఫిరాయింపుల‌పై ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర్కొన్న జ‌లీల్‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున‌నే పోటీ చేస్తాన‌ని చెప్పారు. జ‌గ‌న్‌ కు షాకిచ్చిన‌ట్లుగా చంద్ర‌బాబుకు షాకివ్వ‌బోన‌ని తెలిపారు.

ఇక వైసీపీ టికెట్‌ పై గెలిచిన తాను టీడీపీలోకి చేరిన త‌ర్వాత ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధంగానే ఉన్నాన‌ని, త‌న సొంత బ‌లంతోనే ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధిస్తాన‌ని, లేదంటే చెప్పుల దండ‌లు మెడ‌లో వేసుకుని ఊరేగుతాన‌ని కూడా చెప్పారు. అదే స‌మ‌యంలో తాను విజ‌యం సాధిస్తే... వైసీపీని మూసేస్తారా అని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక వైసీపీ - కాంగ్రెస్‌ - టీడీపీల్లో త‌న‌కు ద‌క్కిన గౌర‌వంపై ఆయ‌న మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ త‌న‌కు తీర‌ని అన్యాయం చేసింద‌న్నారు. వైఎస్ సీఎంగా ఉండ‌గా, డీఎస్ త‌న‌కు తీర‌ని ద్రోహం చేశార‌ని ఆరోపించారు. ఆ త‌ర్వాత తాను టీడీపీలో చేర‌గా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న కార్యాల‌యానికి వ‌చ్చి.. స్వ‌యంగా త‌న‌ను తిరిగి కాంగ్రెస్‌ లోకి తీసుకెళ్లార‌ని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్‌పై స్పందించిన జ‌లీల్ ఖాన్‌... జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాద‌ని తేల్చిచెప్పారు. ఈ ఒక్క వ్యాఖ్య‌తోనే జ‌గ‌న్‌ కున్న స‌త్తా ఏపాటిదో జ‌లీల్ చెప్పేశారు. అయితే త‌న‌ను తాను సీనియ‌ర్‌ గా అభివ‌ర్ణించుకున్న జ‌లీల్‌... సీనియ‌ర్లు ఇచ్చే స‌ల‌హాల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోర‌ని వ్యాఖ్యానించారు. ఈ కార‌ణంగానే తాను వైసీపీని వీడాల్సి వ‌చ్చింద‌న్నారు. అయితే తిరిగి వైసీపీలో చేరే అవ‌కాశాలే లేవ‌న్నారు. ఇక బెజ‌వాడ‌కు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో త‌న‌కున్న వైనంపై నోరు విప్పేందుకు జ‌లీల్ స‌సేమిరా అన్నారు. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గం పేరు కూడా ప‌లికేందుకు ఆస‌క్తి చూప‌ని జ‌లీల్ ఖాన్‌... విజ‌యవాడ వ‌న్ టౌన్ ఎంత‌?... ఐదు నిమిషాల్లో క‌ర్రా బిళ్లా ఆడేస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక త‌న‌కు విప‌రీతంగా ప్ర‌చారం క‌ల్పించిన బీకామ్‌లో ఫిజిక్స్ కామెంట్‌ పై చంద్ర‌బాబు స్పంద‌న‌ను కూడా జ‌లీల్ వివ‌రించారు. అంద‌రిలాగే చంద్ర‌బాబు కూడా త‌న కామెంట్ పై న‌వ్వార‌ని,  అయితే  మీరొక్క‌రేనా?  చాలా మంది ఇలా మాట్లాడేస్తుంటారు. ఏం ఫ‌ర్వా లేదు  అని చంద్ర‌బాబు అన్నార‌ని జ‌లీల్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News