బీకాంలో ఫిజిక్స్ అన్నా ఎలాగున్నావే..?

Update: 2017-03-08 04:29 GMT
కామెడీ..కామెడీగా మారి.. ఎటకారం చేసుకోవటానికి సరికొత్త ముడిసరుకుగా మారిన ‘బీకాంలో ఫిజిక్స్ చదివా’ ఇమేజ్ పై అదిరిపోయే వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. చాలా సీరియస్ గా ‘‘నేను.. బీకాంలో ఫిజిక్స్ చదివా’’ అంటూ ఆయన చెప్పిన ఇంటర్వ్యూను ఇప్పటికే కోట్లాది మంది చూసేశారు. ఆయనా మాటల్ని ఎలా చెప్పారు.. ఏందన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్క ఇంటర్వ్యూతో సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్న వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది.. జలీల్ ఖాన్ మాత్రమేనని చెప్పొచ్చు.

సరికొత్త కామెడీగా మారిన బీకాంలో ఫిజిక్స్ ఇమేజ్ ను తాను ఎంజాయ్ చేస్తున్నట్లుగా చెప్పి మరోసారి సంచలనంగా మారారు జలీల్ ఖాన్. వెలగపూడిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జలీల్ ఖాన్ అసెంబ్లీ లాబీల్లో నడుస్తున్న వేళ.. ఎమ్మెల్యే ఆర్కే రోజా జలీల్ ఖాన్ కు ఎదురు పడ్డారు. వెంటనే ఆమె.. ‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలుకరించారు. ఆమెతో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను పలుకరించారు. తాము ధర్నాలు చేసినా.. అరెస్ట్ చేసినా రాని గుర్తింపు వచ్చేసిందని.. మీరు బీకాంలో ఫిజిక్స్ అనగానే ఊహించనంత పాపులార్టీ వచ్చేసిందంటూ ఛలోక్తిగా మాట్లాడారు. అదే సమయంలో ఆయనకు ఎదురుపడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సైతం.. ‘‘బీకాంలో ఫిజిక్స్ అన్నా ఎలాగున్నావే..?’’ అంటూ పలుకరించారు. ఆయనే కాదు..

మామూలుగా అయితే.. ఈ మాటకు అగ్గి మీద గుగ్గిలం అయిపోవాలి.కానీ.. అలా అయితే ఆయన జలీల్ ఖాన్ ఎందుకవుతారు? అన్న చందంగా ఆయన ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. బీకాంలో ఫిజిక్స్ మాట తనకు చాలా మేలే చేసిందని.. తనకు ఎనలేని గుర్తింపు తెచ్చి పెట్టిందని చెప్పుకున్న ఆయన.. మీడియాలో ఏం చెప్పినా రివర్స్ లో చెప్పాలని.. అప్పుడే బాగా చూపిస్తారంటూ కొత్త సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చారు. ‘సీదాగా చెబితే ఎవరైనా చూపిస్తారా? ఉల్టాగా చెబితేనే చూపిస్తారు. నేను మంచి మాటలు చెబితే మీడియాలో చూపిస్తారా? నేను బీకాంలో ఫిజిక్స్ కు సంబంధించి చెప్పిందంతా చూపించలేదు. ఎడిట్ చేసి చూపించారు. వాళ్లకేం కావాలో అదే చూపిస్తారు’’  అంటూ కూల్ గా సమాధానమిచ్చారు. ఆయనిచ్చిన వివరణ చూసినప్పుడు ఇంత కూల్ గా మాట్లాడటం.. ‘బీకాంలో ఫిజిక్స్’ చదివిన వాళ్లకు మాత్రమే సాధ్యమన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News