కేసీఆర్ మా దేవుడు అంటున్న జ‌లీల్‌

Update: 2017-05-23 05:48 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మ‌రో ఊహించ‌ని కితాబు ద‌క్కింది. తెలంగాణ సీఎం తమ పాలిట దేవుడిలాంటివాడని ఆంధ్రా ముస్లిం వేదిక కొనియాడింది. ముస్లిం మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షనీయమని పేర్కొంది. అది కూడా ఢిల్లీ సాక్షిగా కావ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ,  ఆంధ్రా ముస్లిం వేదిక   ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగింది. ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ తెలంగాణ సీఎంపై ప్ర‌శంస‌లు కురిపించారు.

తెలంగాణ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించాలని, ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలపాలని  ఆంధ్రా ముస్లిం వేదిక అధ్య‌క్షుడు షేక్ జ‌లీల్‌ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా అన్ని ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతామని, ఏపీలో సైతం ఆ పార్టీని విస్తరించాలన్నది తమ అభిమతమని జలీల్ పేర్కొన్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో ముస్లింకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, కానీ ఏపీలో మాత్రం ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుపట్టారు. ఏపీ ముఖ్యమంత్రి ముస్లింలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. చివరకు ముస్లిం మైనారిటీ మంత్రిత్వశాఖకు మంత్రి కూడా లేకపోవడం బాధాకరమని జలీల్ వాపోయారు. ముస్లిం రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌క‌పోతే త‌మ నిర‌స‌న‌లు మొద‌లుపెడ్తామ‌ని తెలిపారు.


Tags:    

Similar News