బిగ్ గెస్: జమ్ముకశ్మీర్ ట్రైఫరికేషన్ నిజమేనా?

Update: 2019-08-03 18:39 GMT
రగులుతున్న కశ్మీరాన్ని దారికి తెచ్చేందుకు శస్త్ర చికిత్స చేయడానికే మోదీ సిద్ధ మైనట్లు గా కనిపిస్తోంది. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌ లో జరుగుతున్న పరిణామాలన్నీ ఆపరేషన్ కశ్మీర్ మొదలైందనడానికి సూచికలుగా నిలుస్తున్నాయి. దశాబ్దాలుగా కొలిక్కిరాని కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కరం చూపేందుకు మోదీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. అందులో భాగంగా 'ఆపరేషన్ కశ్మీర్' కు ప్రధాని మోదీ ముహూర్తం పెట్టారనే వినిపిస్తోంది. కశ్మీర్ ట్రైఫరికేషన్‌ తో అనూహ్య పరిష్కారం చూపే దిశగా కేంద్రం రెడీ అవుతోందని వినిపిస్తోంది.

ఏమిటీ ట్రైఫరికేషన్

హిందువులు - సిక్కులు ఎక్కువగా ఉండే జమ్ముని రాష్ట్రంగా ఉంచి.. ముస్లిం జనాభా అధికంగా గల కశ్మీర్‌ - బౌద్ధులు ఉండే లద్దాఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని.. అంటే ప్రస్తుత జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి కొంత ప్రశాంతంగా ఉండే జమ్మును రాష్ట్రంగా కొనసాగించి కశ్మీర్‌ను రెండు ముక్కలు చేసి కేంద్రం పాలనలోకి తీసుకోవడం. అంటే మొత్తంగా మూడు ముక్కలు చేయడమే ఈ ట్రైఫరికేషన్.

ఇదే జరిగితే ఆర్టికల్ 35ఏ - 370లు కూడా రద్దయిపోతాయి. అయితే.. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ నాయక్ ఈ ఊహాగానాలను ఖండించారు. ఉగ్రదాడులు జరగొచ్చనే ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలోనే యాత్రికులను ఖాళీ చేయించడం.. అదనపు బలగాలను మోహరించడం చేస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో మామూలుగానే 3 లక్షల మంది సైనికులుంటారు. అమరనాథ్ యాత్రికులకు రక్షణ కల్పించేందుకు 40వేల మంది సైనికులు కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. కశ్మీర్ వ్యాలీలోని పోలీసులు, భద్రతాసిబ్బంది, సైనికులకు వీరు అదనం. మొన్నామధ్యన పదివేలమందిని, ఇప్పుడు మరో పాతికవేలమంది కశ్మీర్ కు పంపుతున్నారు. ఇటీవల కశ్మీర్ ను జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సందర్శించి, ఢిల్లీకి వెళ్లారు. ఆ తరువాతనే, కశ్మీర్ విషయంలో మోదీ ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదనపు సైన్యాన్ని అక్కడకు ఎందుకు పంపుతున్నారన్న అంశంపై రకరకాలుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏదో కీలక మార్పే జరగబోతోందని వినిపిస్తోంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం దిశగా..

అంతర్జాతీయంగా భారత్ ఇప్పుడు పరపతి పెంచుకోవడం.. పాకిస్తాన్ ఒంటరి కావడంతో ఇదే అదనుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే భారీ అల్లకల్లోలం జరుగుతుంది కాబట్టి అన్నిటినీ ఎదుర్కొనేందుకు ముందుగా సర్వం సిద్దం చేస్తున్నారని టాక్.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పిన మధ్యవర్తిత్వ అంశానికీ దీనికీ కూడా ముడిపెట్టి ఊహాగానాలు మొదలయ్యాయి. పీవోకే స్వాధీనం గురించి అమెరికాకు భారత్ ముందస్తు సమాచారం ఇచ్చిందని.. ఆ అవకాశంతోనే ట్రంప్ తనను మధ్యవర్తిత్వం చేయమని మోదీ కోరారంటూ అంతలా అడ్వాంటేజ్ తీసుకుని చెప్పగలిగారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. అగ్రరాజ్యం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, మరికొన్ని కీలక దేశాలనూ మోదీ కన్విన్స్ చేయడంతో పీవోకే స్వాధీనానికి భారత సైన్యం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
Tags:    

Similar News