ముక్కు నేలకు రాస్తా.. జమున ఆగ్రహం మామూలుగా లేదుగా?

Update: 2021-05-30 07:31 GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు. ఇక జరగబోయేది మరో ఎత్తా? అంటే అవునని చెబుతున్నారు. ఈటల రాజేందర్ త్వరలో బీజేపీలోకి చేరటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. తన సతీమణి ఈటల జమునను రాజకీయాల్లోకి తీసుకొస్తారన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం ఆమె తమ నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం తాము ఎంత కష్టపడింది చెప్పిన ఆమె.. అబద్ధాల్ని ప్రచారం చేస్తే వాటిని ఎలా తిప్పి కొట్టాలో తమకు తెలుసన్నారు. అంతేకాదు.. తమ హేచరీస్.. గోదాములపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. తాము కష్టపడి పైకి వచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు.

వ్యూహాత్మకంగా పోలీసుసలతో భయభ్రాంతుకలు గురి చేస్తున్నారన్నారు. మూసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశామని.. ఒక్క ఎకరం అదనంగా ఉన్నా ముక్కునేలకు రాస్తానని సవాలు విసిరారు. ఒకవేళ.. ఎలాంటి తప్పు లేకుంటే.. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని ప్రశ్నించారు. తమ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయటం బాధాకరమన్నారు.

1992లో దేవరయాంజల్ వచ్చి 1994లో భూములు కొన్నామని..తమ గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారన్నారు. తాము ఎవరికి అన్యాయం చేయలేదని.. దోపిడీకి పాల్పడలేదని.. ఎప్పకైనా న్యాయం గెలుస్తుందని.. ధర్మం నిలబడుతుందన్నారు. సర్వే చేయొద్దని తాము చెప్పలేదని.. తమ సమక్షంలో సర్వే చేయాలని మాత్రమే చెప్పామన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని వదిలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంట నడవాలని అప్పట్లో తమపై ఒత్తిళ్లు వచ్చాయని.. అప్పటి మంత్రి రత్నాకర్ రావు చాలాసార్లు చెప్పారన్నారు. కానీ.. తాము మాత్రం వెళ్లలేదన్నారు. సమైక్య పాలనలో కులాలు చూడలేదని.. కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నామన్నారు. ఇప్పుడు కులాలతో విభజన చేస్తున్నారని.. తమకు అన్ని కులాలు సమానమేనని చెప్పారు. అన్ని కులాలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందని.. ఫౌల్ట్రీ అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేసినట్లుగా జమున చెప్పారు.

Tags:    

Similar News