పీవీకి భార‌త‌ర‌త్న..కాంగ్రెస్ నేత కొత్త డిమాండ్‌

Update: 2018-04-29 06:44 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత - సీఎల్పీ నాయ‌కుడు జానారెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత‌లు వీలైనంత దూరం పెట్టే పీవీ న‌రసింహ‌రావు కోసం ఆయ‌న గ‌ళం విప్పారు. మాజీ ప్రధాని - తెలుగు బిడ్డ దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీకి జానారెడ్డి లేఖ రాశారు. ప్ర‌ధానిగా ప‌నిచేసిన పీవీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధ్యుడ‌ని పేర్కొంటూ ఆర్థిక‌వేత్త‌ - బ‌హుబాష కోవిదుడు - ర‌చ‌యిత అయిన పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ఆయ‌న వివ‌రించారు. అయితే జానారెడ్డి ఈ విధంగా డిమాండ్ చేయ‌డంపై కొత్త చ‌ర్చ మొద‌లైంది.

పీవీ న‌ర‌సింహారావును పార్టీల‌కు అతీతంగా నేత‌లు గౌర‌విస్తున్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ నేత‌లు మాత్రం ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన గాంధీ కుటుంబం మాత్రం ఆయ‌న్ను గుర్తించ‌ద‌నే అభిప్రాయం ఉంది. ఒక‌వ‌ర్గం వారికి న‌చ్చ‌ని విధంగా పీవీ వ్య‌వ‌హ‌రించార‌ని పేర్కొంటూ అందుకే వారి ఓట్లు దూర‌మ‌వుతాయ‌నే ఆలోచ‌న‌తో హ‌స్తం పార్టీ పెద్ద‌లు ఆయ‌న్ను త‌మ పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో కూడా ఆయ‌న‌కు చోటు ఇవ్వర‌ని చెప్తుంటారు. అందుకే ఆయ‌న‌కు ఢిల్లీలో స్మార‌కం నిర్మించ‌లేదని కూడా అంటుంటారు. అలాంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితుడ‌నే పేరున్న జానారెడ్డి ఈ డిమాండ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అయితే దీనికి కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి మ‌రో ర‌క‌మైన విశ్లేష‌ణ వ‌స్తోంది. కాంగ్రెస్ యువ‌నేత‌ల అంత‌టి దూకుడును సీనియ‌ర్ నేత‌గా ఇటీవ‌ల జానారెడ్డి ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నార‌ని...ఈ క్ర‌మంలో త‌న ముద్ర‌ను చాటుకునేందుకు జానారెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. దీంతోపాటుగా ఒక‌వేళ భార‌త‌ర‌త్న సాధిస్తే ఆ ఘ‌న‌త త‌న ఖాతాలో చేరుతుంద‌ని కూడా భావిస్తు ఉండ‌వ‌చ్చ‌ని వివ‌రిస్తున్నారు.
Tags:    

Similar News