కేసీఆర్‌ ను ఎంత అమాయ‌క‌పు ప్ర‌శ్న అడిగావు జానా?

Update: 2018-06-30 04:50 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధిన‌త కేసీఆర్‌ కు - కాంగ్రెస్ నేత‌ల‌కు ఉన్న తేడా ఏంటో తెలియ‌జెప్పే ఉదాహ‌ర‌ణ ఇది. ఓ వైపు రాజ‌కీయ చాణ‌క్యంతో పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం ప‌రిపాల‌న‌పై త‌న ముద్ర వేసుకుంటూ కేసీఆర్‌ అనూహ్య‌మైన దూకుడుతో ముందుకు సాగుతుండ‌ట‌మే కాకుండా ముంద‌స్తుకు కూడా కాలు దువ్వుతుంటే...మ‌రోవైపు ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ మాత్రం చిత్ర‌మైన ప్ర‌శ్న‌లు వేస్తోంది. అధికార పార్టీని ఢీకొట్టే కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాల్సిన ప్రతిపక్షనేత కె జానారెడ్డి దాన్ని నామ్ కే వాస్తీగా పేర్కొంటూ కేసీఆర్‌ కు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల సిగ్న‌ల్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సై అని ప్ర‌క‌టించ‌గా గాంధీభవన్‌ లో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో కలిసి విలేకరులతో మాట్లాడిన జానారెడ్డి కొత్త ప్ర‌స్తావ‌న తెచ్చారు. రాజ్యాంగబద్ధంగా టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్ల‌ కాలానికి అధికారం కట్టబెడితే... ముందుస్తు ఎన్నికలు వస్తా యంటూ ఎందుకు అంటున్నారో సమాధానం చెప్పాలని  నిలదీశారు. రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు - విపత్తులు ఏర్పడిన సమయంలో మాత్రమే ముందస్తు ఎన్నికలు వస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఏమీలేవని చెప్పారు. త‌ద్వారా కేసీఆర్ వ్యూహాన్ని కాకుండా..ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. మ‌రోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుస్తు ఎన్నికలకు పోవాలని చూస్తుందని, దాని ట్రాప్‌ లో టీఆర్‌ ఎస్‌ పడినట్టు కనిపిస్తోంద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే...ఎందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేస్తే కాంగ్రెస్‌ పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని - ఎన్ని సీట్లు వస్తాయనేది తాను ఇప్పుడే చెప్పలేనని జానారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు.

టీఆర్‌ ఎస్‌ నేత - రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ లోకి వస్తారన్న సమాచారం తమకు తెలియదని పార్టీ సీనియ‌ర్ల‌లో ఒక‌రైన జానారెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీలో మార్పులు - చేర్పులు జరుగుతాయన్న సమాచారం లేదని ఆయ‌న పేర్కొన్నారు. దీనిపై అధిష్టానం ఏం నిర్ణయించినా దాని ప్రకారం నాయకులు - కార్యకర్తలు పని చేయాల్సి ఉంటుందన్నారు.  పార్టీ నేతల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జోగులాంబగద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ - పార్టీ నాయకులను హౌజ్‌ అరెస్ట్‌ చేయడం తీవ్రమైన చర్యగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతామంటే నిర్బంధించడం సరైందికాదన్నారు. ఇది సీఎం నియంతత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులంతా ఐక్యంగానే ఎన్నికలను ఎదుర్కొంటామని జానారెడ్డి ముక్తాయించారు!
Tags:    

Similar News